జిల్లా కేంద్రంగా అవతరించిన సూర్యాపేటలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు లేక పట్టణవాసులు ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నారు. రోడ్ల వెడల్పు జరగాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నప్పటికి విస్తరణ దిశగా కార్యరూపం దాల్చలేదు. పలువురు ప్రజా ప్రతినిధులు మారినా రహదారుల విస్తరణ జరగలేదు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తన మేనిఫెస్టోలో రోడ్ల వెడల్పును ప్రధాన అంశంగా చేర్చారు. ఎన్నికల్లో గెలిచినా.. పలు కారణాలతో విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది.
కోర్టుకెళ్లిన కొందరు వ్యాపారులు...
ఇప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి విస్తరణపై పట్టుదలగా ఉన్నారు. రోడ్ల వెడల్పులో దుకాణాలు కోల్పోతున్న బాధితులతో ఇప్పటికే పలు దఫాలు సమావేశమయ్యారు. బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 364 మంది వ్యాపారుల్లో 14 మంది కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. అవసరం అయితే కోర్టుకు వెళ్లిన వారి దుకాణాలను వదిలేసి మిగిలినవి కూల్చాలని నిర్ణయించారు. ఇప్పటికే 80 మంది వ్యాపారులు రహదారి విస్తరణకు మద్దతు తెలిపారు. మరికొందరు వ్యాపారులు మాత్రం వందకు బదులు 80 ఫీట్లు మాత్రమే విస్తరించాలని కోరారు.
రోడ్డు అంతా ఆక్రమించారు...
విజయవాడ జాతీయ రహదారి అప్పట్లో సూర్యాపేట జిల్లా కేంద్రం మధ్య నుంచి వెళ్లింది. 1952లో ఈ రహదారి వంద ఫీట్లు ఉంది. జాతీయ రహదారి మొత్తం 164 అడుగులు కాగా... వందఫీట్ల మేరకు జాతీయ రహాదారి నిర్మించారు. కాలక్రమంలో జాతీయ రహదారిని సూర్యాపేట శివారు నుంచి నిర్మించారు. ఇదే అదనుగా వ్యాపారులు పాత జాతీయ రహదారిని ఆక్రమించుకున్నారని నేషనల్ హైవే అధికారులు రికార్డు చూపుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారిన తర్వాత రోజురోజుకు విస్తరిస్తున్న పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ ప్రధాన సమస్యగా మారింది. రద్దీకి తగ్గట్టుగా రహదారుల విస్తరణ ప్రచారం దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఇటీవల పట్టణం గుండా వెళ్తున్న పాత జాతీయ రహదారిని నేషనల్ హైవే అధికారులు మున్సిపాలిటీకి అప్పగించారు. విస్తరణకు పట్టుదలగా ఉన్న పురపాలక అధికారులు వెంటనే.. దుకాణాలు ఖాళీ చేయాలని మూడు రోజుల కిందటే హెచ్చరిక నోటీసులు అందించారు.
విస్తరణకు అధికార తెరాస సిద్ధంగా ఉండగా కాంగ్రెస్, భాజపా, వామపక్షాల నాయకులు పరిహారం చెల్లించాకే కూల్చివేయాలని మెలిక పెడుతున్నారు. కూల్చివేతలపై వెనకడుగు లేదని అధికారులు చెబుతున్నారు.
తొలి దశలో హెడ్ పోస్టాఫీసు ముందు నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు రహదారిని విస్తరించనున్నారు. వాస్తవంగా పట్టణం మధ్యలో వంద ఫీట్ల రహదారిని నిర్మించాలనుకున్న పురపాలక సంఘం అధికారులు... వ్యాపారుల వినతులపై వెనక్కి తగ్గారు. పాత జాతీయ రహదారి తో పాటు శంకర్ విలాస్ నుంచి గాంధీ విగ్రహం వరకు 80 ఫీట్లకు విస్తరించనున్నారు. పూల సెంటర్ నుంచి వాణిజ్య భవన్ వరకు 60 అడుగులకు పెంచనున్నారు.
ఇవీ చూడండి:రాజకీయాల నేపథ్యంలో జైపాల్‌రెడ్డి టెన్ ఐడియాలజీస్ పుస్తకం