ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సాగర్ ప్రధాన డ్యాంకు దిగువన వంతెన ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి నిర్మాణానికి ముందడుగు వేశారు. రూ.24 కోట్లతో వంతెన నిర్మాణం చేయాలని నిర్ణయించి 2001లో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణ పనులను 2001 నుంచి 2004 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న ప్రకారం వంతెన నిర్మాణ పనులు 2004 జులై వరకు పూర్తిచేశారు. వంతెన నిర్మాణానికి శ్రీకారం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా.. వంతెనను 4 జులై 2004న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు.
దూరం తగ్గింది
సాగర్ వద్ద కొత్తవంతెన నిర్మాణం చేసిన తర్వాత సాగర్-మాచర్ల మధ్య దూరం తగ్గింది. గతంలో సాగర్ నుంచి మాచర్లకు వెళ్లడానికి ప్రధాన డ్యాం పైనుంచి వెళ్లేటప్పుడు 30కిలోమీటర్ల దూరం ఉండేది. వంతెన పైనుంచి రాకపోకలతో సుమారు 12 కి.మీ దూరం తగ్గింది.
విద్యుత్ దీపాలు లేకపోవడం
నూతన వంతెన నిర్మాణ సమయంలో అధికారులు ముందుచూపు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెన పై ఎలాంటి విద్యుత్ దీపాలు లేకపోవడంతో సుమారు అర కిలోమీటర్ పొడవు ఉండటంతో రాత్రిళ్లు ఎవరు ఏమి చేస్తున్నారన్న విషయం తెలియడం లేదు. వంతెనకు ఏర్పాటు చేసిన రక్షణగోడ ఎత్తు లేకపోవడంతో ప్రమాదకరంగా ఉంది. వంతెన రక్షణ గోడ ఎత్తు తక్కువగా ఉండటం, గాలి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా ఉండటంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వంతెనపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తే అందానికి అందం, భద్రత పరంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి : నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరుల అరెస్టు