కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు హాజరుకానున్నారు. సంతోష్‌బాబు పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించి.. అక్కడ నుంచి రోడ్డు మార్గాన సూర్యాపేటకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటల లోపు సంతోష్ పార్థీవ దేహం సూర్యాపేటకు చేరే అవకాశం ఉంది.
జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటికలో సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు తల్లిని ఫోన్ ద్వారా ఉత్తమకుమార్ రెడ్డి పరామర్శించారు. కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఆ కుటుంబానికే కాకుండా దేశానికి కూడా తీరని లోటని అభిప్రాయపడ్డారు.
భారత సైన్యంతో నేరుగా ఢీకొట్టే ధైర్యంలేక దొంగచాటుగా చైనా చేసిన దాడిలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోషబాబు వీరమరణం పొందడం పట్ల భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. సంతోష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సంతోషబాబు వీరమరణం విషాదకర ఘటనగా అభివర్ణించిన ఆయన చైనా దాడిలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: తక్కువ ధరకే మాస్కులు... నకిలీ పత్రాలతో పక్కా ప్లాన్