సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన అమ్మాయి వివాహానికి గ్రామస్థులే తల్లిదండ్రులయ్యి వివాహం జరిపించారు. నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన దాసరి మమత తల్లిదండ్రులు మల్లయ్య, సోమమ్మ సుమారు 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు.
నాటి నుంచి నేటి వరకు మమత తన నానమ్మ వద్దే ఉంటూ జీవనం సాగించింది. రెక్కడితే గాని డోక్కడని దాసరి సౌన్నమ్మ వృద్ధాప్య కారణంగా ఆర్థికంగా మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పెళ్లి వయసు వచ్చిన ఆడపిల్లకు వివాహం చేయడానికి ఇబ్బందులు పడుతున్న ముసలి నానమ్మ కష్టాన్ని చూసి కుమిలిపోయే మమతకు జాజిరెడ్డిగూడెం మండలం లోయపల్లి గ్రామానికి చెందిన మహేశ్తో ఇటీవల వివాహం కుదిరింది. కానీ వివాహం జరిపించడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డం వచ్చాయి. అలాంటి సమయంలో ఇరుగుపొరుగు వారు ఎవరికి తోచినంత వారు సాహయార్ధంగా అందిస్తూ... ఆ అమ్మాయి వివాహాన్ని గురువారం ఘనంగా జరిపించారు. దానికి తోడు గ్రామంలోని యువత మేమున్నాం అంటూ ముందుకు వచ్చి అనాథ బాలిక వివాహానికి సుమారు 80వేల రూపాయలను కానుకగా అందించారు. తన వివాహానికి సహాయం చేస్తూ తనకు తన నానమ్మకు అండగా నిలబడిన గ్రామస్థులకు మమత ఆనందబాష్పాలతో తన కృతజ్ఞతను తెలిపింది.
ఇదీ చూడండి- నిఘా నీడలో: స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ఠ భద్రత