శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృత దేహం లభ్యమైంది. మృతుడు ఏఈ సుందర్‌గా అధికారులు గుర్తించారు. మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొలుత ప్యానల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జలవిద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ కేంద్రంలో 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగ మార్గం ద్వారా బయటపడగా.. సహాయక సిబ్బంది మరో ఆరుగురిని రక్షించారు. మిగిలిన తొమ్మిది మంది లోపలే చిక్కుకు పోయారు. తెల్లవారు జాము నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు.
రాత్రి విధుల్లో పాల్గొన్న డీఈ శ్రీనివాస్, ఏఈలు మోహన్, ఫాతిమా, వెంకట్రావు, ప్రాజెక్టు అసిస్టెంట్ రాంబాబు, జేపీఏ కిరణ్‌కుమార్‌తో పాటు అమర్ రాజా బ్యాటరీస్‌కు చెందిన ఇద్దరు ఎలక్ట్రీషియన్‌ల ఆచూకీ ఇంకా తెలియలేదు. వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు. మంటల ద్వారా వ్యాపించిన పొగ ఇంకా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకమేర్పడుతోంది. విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన సిబ్బంది ఎలా ఉన్నారోనని వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్, ట్రాన్స్‌కో సీఈ రమేశ్ తదితరులు సహాయక చర్యలను దగ్గరుడి పర్యవేక్షిస్తున్నారు.