సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో కొన్ని రోజులుగా వస్తున్న భూప్రకంపనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోజూ మండలంలో ఏర్పడుతున్న భూప్రకంపనలపై జిల్లా కలెక్టర్, భూ భౌతిక పరిశోధన విభాగం వారితో మాట్లాడానని తెలిపారు.
పులిచింతల ప్రాజెక్టులో మొదటిసారి గరిష్ఠ స్థాయిలో 46 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి.. ఒకేసారి సుమారు 20 టీఎంసీల నీటిని కిందికి వదలడం వల్ల భూమి కంపిస్తుందని తెలిపారు. ఇలా ఒకేసారి నీటిని వదలడం వల్ల భూమి లోపల పొరలు, పలకల మధ్య నీరు చేరి ఉండొచ్చని.. భూమి లోపల సున్నపురాయి మెత్తబడి ఒత్తిడికి గురి కావడం వలన స్థానభ్రంశం జరిగి భూప్రకంపనలు ఏర్పడుతున్నాయని భూభౌతిక పరిశోధన విభాగం తెలిపిందన్నారు.
ఇవి ప్రమాద స్థాయిలో ఏర్పడే భూప్రకంపనలు కావని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైదిరెడ్డి అన్నారు. మండల ప్రజలకు సిమెంటు క్వారీల వల్లే ప్రకంపనలు ఏర్పడుతున్నాయన్న అనుమానాలున్నాయని.. దానిపై కూడా విచారణ జరపాలని జియాలజిస్ట్లను కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.