సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే... రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సాగుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి పర్యటించారు. కేసారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. మూసీ ఆనకట్టను ఆధునీకరణ చేసిన ఘనత తెరాసదేనని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మహత్యలు లేని తెలంగాణగా మార్చింది కేసీఆరేనని కొనియాడారు. రైతులు ఆదాయం పెంచుకునే పంటలను అన్వేషించాలని రైతులకు జగదీశ్‌రెడ్డి సూచించారు.
దేశంలోనే ఎక్కువ వరి సాగు తెలంగాణలో జరిగిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఖరీఫ్ కంటే రబీలోనే అత్యధిక సాగు జరిగిందన్న మంత్రి... రైతులు మిర్చి సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. సులభంగా అమ్ముకునే పంటలనే రైతులు పండించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి సన్నరకాలనే పండించాలన్నారు. దొడ్డు రకం ధాన్యం సాగును రైతులు తగ్గించాలని కోరిన నిరంజన్‌రెడ్డి... ఉన్నత విద్యావంతులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌పామ్ సాగులో సూర్యాపేట, వనపర్తి మధ్య పోటీ నెలకొందని పేర్కొన్నారు.