మరో పదిరోజుల్లో ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. చివరి ఆయకట్టు కింద సూర్యాపేట జిల్లాకు 10 నెలల పాటు సాగు నీరందించేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉందని మంత్రి పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో రైతులకు పంటరుణాల చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలోని 6 ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలోని 86 గ్రామాలకు చెందిన రైతులకు రూ.5.50 కోట్ల పంట రుణాలను అందించారు.
రైతులు పండించిన పంటకు అధిక ధరలు వచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పంటకు పెట్టుబడి అందిస్తుందని గుర్తు చేశారు. సాగునీటిపై దృష్టి పెట్టి ఫలితం సాధిస్తున్న ప్రభుత్వం... రైతులకు ఆదాయం సమకూరే విధంగా కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొత్త మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఆమోదం.. స్పందించిన భారత్