సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మట్టపల్లి గ్రామంలోకి పులిచింతల బ్యాక్ వాటర్ వరద ప్రవాహం కొనసాగుతోంది. గత రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు.. సాగర్ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి మట్టపల్లి గ్రామం నీటమునిగింది. గతంలో పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చిందని స్థానికులు వాపోతున్నారు.
మట్టపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చుట్టూ నిర్మించిన కరకట్టకు గండి పడి.. దేవస్థానంలోకి వరద నీరు వచ్చి చేరింది. మోటార్ల సహాయంతో నీటిని బయటకు వదులుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు దేవస్థాన అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పులిచింతల బ్యాక్‌వాటర్ వల్ల గ్రామంలోకి మొసళ్లు వస్తున్నాయని.. గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలతో రాత్రి సమయంలో ఇంట్లో ఉండాలంటే.. భయంగా ఉందని మహిళలు వాపోతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా.. అధికారులు స్పందించడం లేదని మట్టపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో జోరుగా సాగుతోన్న అక్రమ ఇసుక రవాణా