కరోనాతో మృతి చెందిన వ్యక్తిని పూడ్చిపెట్టొద్దని, కాల్చివేయాలని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హిందూ స్మశానవాటిక వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ వైరస్‌తో మృతి చెందారు. అంత్యక్రియలకు బంధువులు కోదాడ మున్సిపల్ అధికారుల సహాయంతో హిందూ స్మశానవాటికలో దహన సంస్కరాలకు ఏర్పాట్లు చేశారు.
పిచికారీ లేకుండా ఎలా నిర్వహిస్తారు...
స్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో కనీసం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయకుండా అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ అధికారులను స్థానికులు నిలదీశారు. స్మశానవాటికలో ప్రతి శవాన్ని కాల్చివేస్తారని... కానీ కరోనా సోకిన వ్యక్తిని పూడ్చడంపై స్థానికులు ఆందోళనకు దిగారు.
ఇబ్బంది లేకుండానే పూర్తి...
మున్సిపల్ అధికారులను వివరణ కోరగా... అన్ని జాగ్రత్తలతో స్థానికులకు ఇబ్బందులు కలగకుండా దహన సంస్కారాలు పూర్తి చేశామని వివరించారు. చివరికి పోలీసులు నచ్చచెప్పడంతో దహన సంస్కారాలను పూర్తి చేశారు.