Mallu Swarajyam : నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం (కరివిరాల దగ్గర) నా స్వగ్రామం. నాన్న భూస్వామి. మూడు గ్రామపంచాయతీల పరిధిలో దాదాపు 500 ఎకరాల పొలం ఉండేది. పెద్ద ఇల్లూ గేదెలూ ఎద్దులూ పనిమనుషులూ.. అట్టహాసంగా ఉండేది. నాన్న తెల్లటి గుర్రంపై వెళుతుంటే గ్రామస్థులు భయంభయంగా పక్కకు తప్పుకొనే వారు. అమ్మ కూడా కలవారి కుటుంబంలోనే పుట్టింది. పుట్టింటి నుంచి అత్తవారింటికి మేనాలో వచ్చే వైభోగం ఉన్నా ఆమె అలాంటి పోకడలకు వ్యతిరేకం. అప్పటికే ప్రజల్ని ఇక్కట్లకు గురిచేస్తున్న నిజాం పాలనకు వ్యతిరేకిస్తుండేది. నాన్న మాత్రం భూస్వామినన్న దర్పం చూపేవాడు.
Mallu Swarajyam News : అయిదుగురు సంతానంలో నడిమి దాన్ని కావడంతో అన్నదమ్ములు, అక్కా చెలెళ్ల ప్రేమానురాగాలకు నోచుకున్నాను. అన్నయ్య భీమ్‌రెడ్డి నరసింహారెడ్డిని చదువుకోవడానికి నల్గొండ పంపారు. ఆడపిల్లలకు ప్రైవేటుగా టీచర్ని ఏర్పాటు చేసి విద్య నేర్పించారు. ఖాళీ సమయంలో మాకందరికీ నాన్న గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్పుతుండేవాడు. నేను అయిదో తరగతిలో ఉన్నట్లు గుర్తు.. అప్పుడు నాన్నకు రెండ్రోజులు బాగా జ్వరం వచ్చి కన్నుమూశారు. అప్పటికే అన్నయ్య కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు.
Mallu Swarajyam Story : నేనూ పోరాటబావుటా ఎగరేయడానికి కారణం ‘అమ్మ’. స్వాతంత్య్ర పోరాట గురించి ఎంతో ఆసక్తిగా తెలుసుకోవడంతోపాటు తనకు తెలిసిన విషయాలన్నీ మాకు చెబుతుండేది. ఓ రోజు అమ్మ ఎక్కడ సంపాదించిందో గానీ ‘అమ్మ’ నవల తెచ్చింది. కొన్ని రోజులపాటు రోజూ దీపం కింద కూర్చుని ఒకరు చదువుతుంటే మిగతా వాళ్లం విన్నాం. ఆ నవల పూర్తయ్యే సరికి నాలో కొత్త ఉత్తేజం. అప్పటికే ఆంధ్రమహాసభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పన్నెండేళ్ల వయసులో ఓసారి అక్కావాళ్లు కొలనుపాకలో జరుగుతున్న సమావేశానికి వెళుతుంటే నేనూ వెళ్లాను.
పేదలతో వెట్టి.. ఆడవారిపై అత్యాచారాలు
Mallu Swarajyam Updates : అప్పట్లో గ్రామాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. భూస్వాములు పేదలతో దౌర్జన్యంగా వెట్టి చేయించుకునేవారు. ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడేవారు. నిస్సహాయంగా ఏడవడం తప్ప వాళ్లు పన్నెత్తు మాట అనే వారు కాదు. జీతగాళ్లు ‘బాంచన్ దొరా’ అంటూ బతికేవారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా అన్నయ్య పోరాటం ప్రారంభించాడు. ఓసారి మా ఊళ్లోని జీతగాళ్లందరినీ రాత్రిపూట మా ఇంట్లో సమావేశపరిచాడు. కానిస్టేబులుగా పనిచేసే మా చిన్నాన్న ఉప్పందించడంతో నిజాం పోలీసులు వచ్చి తలుపుకొట్టారు. అమ్మ కిటికీలోంచి చూసి, తలుపుల దగ్గకు వెళ్లి ‘ఇంత రాత్రివేళ తలుపు తియ్యను. రేప్పొద్దున రండి’ అంది. ఆ సమయంలో నిద్రపోతున్న నన్ను లేపి, అన్నయ్యను తప్పించమని చెప్పింది. నేను దిండుకవరు తీసి, అందులో జొన్నలు (దారిఖర్చులకు, అప్పట్లో ఇళ్లల్లో డబ్బుండేది కాదు) పోసి అన్నయ్యకు అందించి, పారిపోమ్మని చెప్పాను. అన్నయ్యా మరో ఇద్దరు ముగ్గురు వెనుకనుంచి గోడదూకి వెళ్లిపోతూ ‘చెల్లెమ్మా, రేపు నువ్వు ఊళ్లోకెళ్లి జీతగాళ్లకు ధైర్యం చెప్పు. ఎలాగైనా వాళ్లతో సమ్మె చేయించు’ అన్నారు. ఆ మాటలు నాకు ఆజ్ఞలా వినిపించాయి. తెల్లారాక ఊళ్లోకి వెళ్లి జీతగాళ్లను పోగుచేశాను. మొదట్లో భయపడ్డా ధైర్యంచేసి సమ్మె కట్టారు. దాంతో భూస్వాములు పాలేర్లకు జీతాలివ్వక తప్పలేదు.
అది మొదలు పోరాటమే నా జీవితమైంది. లేవడం, ఏదో ఒక గ్రామానికి వెళ్లడం, పేదల హక్కుల కోసం గళమెత్తడం.. ఇదే నా దినచర్యగా మారింది. వరంగల్ జిల్లా దేవరుప్పలలో మా మేనత్త ఉండేది. అక్కడికీ వెళ్లి వెట్టికి వ్యతిరేకంగా పోరాడాను. ఊరికి దూరంగా ఉండే పల్లెల్లోకి వెళ్లి పాటలు పాడటం, అక్కడి వాళ్లతో కలిసి తిరగడం అత్తయ్యకీ మామయ్యకీ నచ్చేది కాదు. నేనవేవీ పట్టించునేదాన్ని కాదు.
ఆ పాట అందర్నీ ఆకట్టుకుంది
ఓసారి విస్నూరు దొర నలుగురైదుగురు బాలింతలను దారుణంగా అవమానించాడు. గడిలోని మగవాళ్లతో వారి చనుబాలు పిండించాడు. ఆ కుటుంబాల్లో మూడు రోజుల పాటు పొయ్యిలో పిల్లి లేవలేదు. ఆ విషయం విన్న నాకు రక్తం మరిగిపోయింది. ముందు వాళ్ల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పాను. ఆ రాత్రి అన్నలు ఆ పల్లెకి వచ్చినప్పుడు ‘పసిపిల్లల తల్లుల్ని ఉయ్యాలో, పాలివ్వనీడమ్మ ఉయ్యాలో’ అంటూ నేను పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది.అప్పట్నుంచీ వాడవాడకీ తిరుగుతూ ఆ పాట పాడే బాధ్యతను నాకప్పగించారు. దాదాపు 30 ఊళ్లలో ఆ పాటతో ప్రజల్లో ఆలోచన రేకెత్తించాను. దొడ్డి కొమురయ్యను కాల్చేసినప్పుడు గూడేల నుంచి వందల మందితో ఆ గ్రామానికి వెళ్లి నిజాం పోలీసులకు ఎదురు నిలిచాం. అయితే రాళ్లతోటీ కర్రలతోటీ దీటుగా ఎదుర్కోలేమని గ్రహించిన ఆంధ్రమహాసభ కొంతమంది వాలంటీర్లను ఎంపిక చేసి కర్రసాము, కొడవళ్లు, వడిసెలు విసరడం, కళ్లల్లో కారం చల్లడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చింది.
ఆ తరువాత భూస్వాముల చేతుల్లో ఉన్న వందల ఎకరాల భూమిని పేదలకు పంచే కార్యక్రమం మొదలైంది. భూస్వామికి వంద ఎకరాలు వదిలి, ఆ పైన ఉన్న భూమిని ఒక్కొక్కరికీ పది ఎకరాల చొప్పున పంపిణీ చేశాం. ఈ భూముల్లో పండిన పంటపై నిజాం కన్ను పడింది. ‘లెవీ’ పేరుతో పండిన పంటనంతా దోచుకోవాలని నిజాం సైన్యం పాత సూర్యాపేటను చుట్టుముట్టింది. ఆ గ్రామానికి వెళ్లి, మూకుమ్మడిగా పోలీసులకు ఎదురు నిలిచాం. చీకటి పడుతుండగా పోలీసులు తోక ముడిచారు. మేమంతా ఆనందంగా ఇళ్లకు వెళ్లాం. ఆ ఏమరుపాటే మమ్మల్ని దెబ్బతీసింది. అర్ధరాత్రి వేళ పోలీసులు మళ్లీ గ్రామంలో చొరబడి ఇళ్లకు నిప్పంటించారు. ధాన్యం దోచుకున్నారు. ఇద్దర్ని కాల్చి చంపారు. ఆ సంఘటనపైనా పాట కట్టాను. రజాకార్ల దాడులు ఎక్కువయ్యాయి. అక్కనీ చెల్లినీ అరెస్టు చేసి జైల్లో ఉంచారు. నేను మాత్రం వాళ్లకు దొరకలేదు.
కొంతమంది అరెస్టయినా గ్రామాల్లో మా ఉద్యమ ఉద్ధృతి తగ్గలేదు. దాదాపు నాలుగు వేల గ్రామాల్లో వెట్టి చాకిరీని అరికట్టగలిగాం. పేదలకు భూములు పంచాం. గ్రామరాజ్యాలను ఏర్పాటు చేశాం. ప్రజల్ని అభద్రతా భావం నంచి బయటపడేసేందుకు గ్రామ రక్షణదళాన్ని ఏర్పాటు చేశాం. వీటిని పర్యవేక్షించేందుకు ప్రాంతీయ దళాల్ని ఏర్పాటుచేశాం. దళంలోని వారికందరికీ వైద్యసేవలో మెలకువలు నేర్పించాం.
ఈలోగా యూనియన్ సైన్యాలు వస్తున్నాయని తెలిసింది. వారికీ వ్యతిరేకంగా పోరాడాలా వద్దా అనే విషయాన్ని తేల్చుకోలేకపోయాం. అప్పుడప్పుడే గ్రామాల్లోకి మళ్లీ భూస్వాముల రాక మొదలైంది. సైన్యం ‘కమ్యూనిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోవా’లని హెచ్చరించింది. ‘పంచిన భూముల్ని దున్నుకునేవారికే సొంతం చేయాలనీ గ్రామ పరిపాలనను కొనసాగించాలనీ అక్రమంగా అరెస్టు చేసిన వారిని వదలిపెట్టాలనీ’ మేం డిమాండు చేశాం. సైన్యం ఒప్పుకోలేదు. పైగా నిర్బంధించడం మొదలుపెట్టింది.
ఆ పరిస్థితుల్లో అనివార్యంగా అడవి బాట పట్టాం. మానుకోట తాలూకా మొదలు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దాకా దళాలను ఏర్పాటు చేశాం. నన్ను రాజకీయ విభాగంలో సభ్యురాలిగా నియమించారు. అయినా తుపాకీ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఆయుధం నా శరీరంలో భాగమైపోయింది. గ్రామాల్లో కిలోమీటర్ల కొద్దీ కాలినడకన తిరిగిన అనుభవం నాకు అండర్‌గ్రౌండ్‌లో బాగా పనికొచ్చింది. గూడేల్లోకి చౌకీదార్లు రాకుండా చూడటం, అటవీ సంపదను కాపాడటం, గిరిజనులకు అన్నివిధాలా సాయపడటం మా ప్రధాన లక్ష్యాలు.
పోలీసులనే హెచ్చరించాను
ఓసారి వరంగల్‌ను ఆనుకుని ఉన్న అడవుల్లో ఓ గిరిజన గ్రామం నుంచి తిరిగొస్తున్నాను. కొంతమంది గిరిజనులు కూడా నాతోపాటు వచ్చారు. తుప్పల్ని దాటుకుని ఇరుకైన రోడ్డులోకి వచ్చాం. దారికి రెండువైపులా కొండలు... సరిగ్గా ఆ సమయంలోనే దళసభ్యుడు పరుగెత్తుకుంటూ వచ్చి నలుగురు పోలీసులు వస్తున్నారని చెప్పాడు. కొండల పక్కనే దాక్కొని, రాళ్లు సిద్ధం చేసుకోమని గిరిజనులకు చెప్పాను. నా పక్కనే ఓ గూడెం మహిళ ఉంది. ఇద్దరం చీకట్లో దాక్కున్నాం. పోలీసులు దగ్గరకు వచ్చారు. నా పక్కనున్న మహిళ తొందరపడి నా దగ్గరున్న తుపాకీ లాక్కొని వాళ్లవైపు గురిపెట్టి పేల్చింది. వాళ్లు వెంటనే పొజిషన్ తీసుకుని లొంగిపొమ్మంటూ హెచ్చరించారు. మా దగ్గర ఉన్నది ఒకే తుపాకీ. నేను కొద్దిగా ఆలోచించి ‘మీరే లొంగిపొండి. మీరు నలుగురే ఉన్నారు. మా దళమంతా దాడికి సిద్ధంగా ఉంది’ అంటూ హెచ్చరించాను. వాళ్లు నా హెచ్చరికల్లో నిజమెంతో తెలుసుకోవాలని కాసేపు ప్రయత్నించారుగానీ, చీకట్లో వీలు కాలేదు. దాంతో వెనక్కి మళ్లారు. ప్రభుత్వం నంచి నిర్దిష్టమైన హామీలు లభించడంతో మేం అడవుల నుంచి బయటపడ్డాం. ఏడేళ్లపాటు పోరాటమే ఊపిరిగా బతికాను. బయటికొచ్చాక పార్టీ మధ్యవర్తిత్వంతోనే మల్లు వెంకటనర్సింహారెడ్డితో పెళ్లయింది. అయన అండర్‌గ్రౌండ్ పోరాటంలో నా సహచరుడు. ఏరియా దళకమాండర్‌గా పని చేసేవాడు. పెళ్లయ్యాకా పూర్తి సమయం పార్టీకే కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. సూర్యాపేటలో కాపురం పెట్టాం. మా గ్రామంలో అమ్మ ఇచ్చిన పొలాన్ని అమ్ముకుని, ఆ డబ్బుతో సూర్యాపేట సమీపంలోని రాయినిగూడెంలో పొలం కొన్నాను.
ఈసారి జీవిత పోరాటం
మళ్లీ పోరాటం. ఈ సారి జీవితంలో. ఆయన పార్టీ పనుల్లో తిరుగుతుంటే నేను వ్యవసాయం చేశాను. కొడవలి పట్టి వరి కోశాను. పిల్లాణ్ని చంకనేసుకుని కుప్పలు నూర్చాను. రెండో సంవత్సరం పొలం పండలేదు. తిండికి కూడా ఇబ్బంది అయింది. ఆయన మిత్రుడొకాయన ట్రాక్టర్ల ఏజెన్సీ ఇస్తానన్నారు. ఆయనే కాదు, నేను కూడా అలాంటి వ్యాపారం వద్దన్నాను. అలాగే నెట్టుకొచ్చాం. పెళ్లై, పిల్లలు పుట్టినంత మాత్రాన నేను పార్టీకి దూరం కాలేదు. ఎక్కడ సభ జరిగినా నన్ను పిలిచేవారు. నిర్భయంగా మాట్లాడేదాన్ని.ఓసారి ఖమ్మంలో సభకు పిలిచారు. పిల్లాణ్ని తీసుకుని, సూర్యాపేట నుంచి లారీలో వెళ్లాను. నంబూద్రిపాద్ వంటి నేతలు వేదిక మీద ఉన్నారు. మధ్యలో నా పేరు పిలిచారు. జనంలోంచి లేచి వేదికపైకి వెళ్లి, భుజం మీద నిద్రపోతున్న పిల్లాణ్ని బల్లమీద పడుకోబెట్టి, కండువా కప్పి, ప్రసంగించాను. ఆగకుండా చప్పట్లు మోగాయి. ఆరోజు ముఖ్య అతిథిగా వచ్చిన రాయప్ప తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి నన్ను మళ్లీ వేదిక మీదికి పిలిచి సన్మానం చేశారు.
ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టారు. అదే గుడిసె, అదే వ్యవసాయం. పుచ్చలపల్లి సుందరయ్య, మరికొందరు పార్టీ సభ్యులు హైదరాబాద్‌లో జాతీయ మహాసభలకు హాజరయ్యేందుకు వెళుతూ సూర్యాపేటలో మా ఇంటికి వచ్చారు. చీకటి పడింది. దీపం కూడా వెలిగించలేదు. ఓ సభ్యుడు సిగరెట్ లైటరు వెలిగిస్తే, ఆ వెలుగులో సుందరయ్య ఏవో కాగితాలు చూపించాడు. చేపట్టబోయే కార్యక్రమాలపై కొన్ని సలహాలు అడిగారు. ఒకతను ‘ఏంటమ్మా ఈ గుడిసెలో ఉంటున్నారా’.. అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
భూస్వామి ఇంటి ముందే దీక్ష
నాకు ఇష్టం లేకపోయినా పార్టీ కోసం తుంగతుర్తి (నల్గొండ జిల్లా) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికయ్యాక అదీ పోరాటమే అయింది. 900 ఎకరాల భూదానోద్యమ భూమిని ఆక్రమించుకున్న భూస్వామి ఇంటి ముందే దీక్షకు దిగాను. చచ్చినట్లు దిగివచ్చాడు.
ఎమ్మెల్యేనయ్యాక కాపురం హైదరాబాద్‌కు మారింది. పార్టీ తరఫున నన్ను దిల్లీ పంపారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి నర్సింహారెడ్డికి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ‘నిమ్స్‌కు తీసుకెళ్లాను. నా దుస్తుల్నీ రూపాన్నీ చూసి వార్డుబాయ్ కూడా లెక్కలేకుండా మాట్లాడాడు. చిర్రెత్తుకొచ్చి కడిగిపారేశాను. అప్పటికప్పుడు హడావుడిగా అన్ని ఏర్పాట్లూ చేశారు. 12 రోజులు కోమాలో ఉన్నాడు. కారణమేంటో ఎవ్వరూ చెప్పలేదు. వెన్నుకు ఆపరేషన్ చేశాక గుండె సమస్య ఉందన్నారు. ‘కేర్’ ఆసుపత్రికి తీసుకెళ్లాను. అక్కడ మూడు నెలలున్నాడు. ఎక్కడికైనా తీసుకెళ్లి ఎలాగైనా ఆయన్ని రక్షించుకోవాలని తాపత్రయపడ్డాను. లాభం లేకపోయింది. ‘మహిళా సంఘం’ అధ్యక్షురాలిగా పదేళ్లు పనిచేశాను. సారా నిషేధ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాను.
ఇవీ చదవండి :
Mallu Swarajyam: రజాకార్ల పాలిట సింహస్వప్నం.. దొరల గుండెలపై తుపాకీ గురిపెట్టిన వీరవనిత!
Mallu Swarajyam: 'సంపన్న కుటుంబంలో పుట్టి.. పదమూడేళ్లకే తుపాకీ పట్టి'