హుజూర్నగర్ ఉప ఎన్నిక... రెండు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారితే... ఆ పార్టీ నుంచి బాధ్యతలు చూస్తున్న నేతలకు కత్తి మీద సాములా మారింది. ఏ చిన్న అవకాశమిచ్చినా ప్రత్యర్థులు దూసుకుపోతారన్న ఉద్దేశంతో... నిరంతరం కాపలా కాస్తున్నారు. దసరా పండుగ నాడు సైతం కుటుంబ సభ్యులతో గడపకుండా ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు.
ఓటు బ్యాంక్ ప్రసన్నం
ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపే తమకు పెద్ద దసరా అన్న భావన... అక్కడి నేతల్లో కనిపిస్తోంది. తమ పార్టీ ఓటు బ్యాంకు దూరం కాకుండా... ఇతర పార్టీ శ్రేణుల్ని మచ్చిక చేసుకుంటూ... ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఇలా రెండు ప్రధాన పార్టీల శ్రేణులు పండుగ నాడు సైతం సొంతిళ్లకు వెళ్లకుండా తీరుతెన్నుల్ని గమనిస్తున్నారు. అధిష్ఠానం ఆదేశించడం ఒక ఎత్తయితే... తమకు కేటాయించిన ప్రాంతాల్లో మంచి ఆధిక్యం తీసుకురాగలిగితే పెద్దల దృష్టిలో పడతామన్నది కూడా... వారిని పండుగకు వెళ్లకుండా చేసింది.
వారిపై ప్రత్యేక దృష్టి
ఇక నియోజకవర్గం మొత్తాన్ని సమన్వయం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నవారు కూడా... ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎక్కడికి పోయేది లేదన్న తీరును కనబరుస్తున్నారు. పండుగకు సొంతూళ్లకు వచ్చేవారిని దూరం చేసుకోవడం ఇష్టం లేని పార్టీల నేతలు... పండుగ నాడు పల్లెలు చుట్టి వస్తున్నారు. వలసపోయిన వారు ఊర్లోకి వచ్చినపుడు వారిని కలిసి వివరాలు తీసుకుంటే... పోలింగ్ రోజున అలాంటి ఓటర్లను ప్రత్యేకంగా తీసుకురావచ్చొన్న ఉద్దేశమూ కనపడుతోంది. ఇలా ఇంతకన్నా మించిన మంచి సమయం దొరకదన్న రీతిలో... ప్రధాన పార్టీలు పండుగ రోజుల్ని కూడా ప్రచారానికి వాడుకుంటున్నాయి.
- ఇదీ చూడండి : జీ హుజూర్ అంటారా.. జై హుజూర్నగర్ అనిపించుకుంటారా?