కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగా 80 మంది కరోనా బాధితులుగా మారిన దృష్యా... సూర్యాపేట జిల్లాలో జన సంచారానికి అడ్డుకట్ట వేస్తున్నారు. సామాజిక వ్యాప్తికి ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగించడమేనని భావిస్తున్న జిల్లా యంత్రాంగం... ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేయాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని 48 వార్డులను రెడ్జోన్లు, కంటైన్మెంట్ జోన్లుగా మార్చి ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినా... ఇంకా ప్రజలు లాక్డౌన్ ఉల్లంఘిస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించారు. కేసులు ఎక్కువగా వెలుగుచూసిన ప్రాంతాల్లోని బారికేడ్లకు సమాంతరంగా... ఇనుప కంచె వేయాలని ఆదేశించారు.
ప్రత్యేకాధికారి పర్యటన
కరోనా వైరస్ నియంత్రణకు ప్రత్యేకాధికారిగా నియమితమైన ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్... జిల్లా అధికారులతో కలిసి అవగాహన కల్పిస్తున్నారు. కూరగాయల మార్కెట్, కొత్తగూడెం బజారు, ఇందిరమ్మ కాలనీలు తిరిగారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో... పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరాలను పరిశీలించారు. ప్రజలు బయటకు రాకుండా చూడగలిగితే... కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని సర్ఫరాజ్ సూచించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రతి ఇల్లునూ తనిఖీ చేయాలని... 14 రోజుల పాటు స్క్రీనింగ్ చేపట్టిన అనంతరం పరిస్థితిని సమీక్షించాలని భావిస్తున్నారు. రెడ్ జోన్లలో ప్రజల అవసరాలు తీర్చేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఫోన్ నంబర్లు... పనిచేయడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఇంటింటి సర్వే
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 83 కేసులకు గానూ జిల్లా కేంద్రంలోనే 54 నమోదు కాగా... ఆత్మకూరు(ఎస్) మండలంలో 15, తిరుమలగిరిలో 7, నాగారం మండలంలో 6, నేరేడుచర్లలో ఒకటి ఉన్నాయి. తిరుమలగిరి మండల కేంద్రంతోపాటు ఆత్మకూరు మండలంలోనూ ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఏడు కేసులు బయటపడ్డ తిరుమలగిరిలో... నిత్యం ఇంటింటి సర్వే కొనసాగుతోంది. సూర్యాపేట సరిహద్దు ప్రాంతాల్లో... ప్రత్యేక చెక్ పోస్టుల ద్వారా రాకపోకల్ని కట్టడి చేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాపై పోలీసుల ప్రాంక్.. వీడియో వైరల్