సహజ వెలుతురు, గాలి ప్రసరించేలా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేశంలోనే తొలిసారిగా సూర్యాపేటలో సమీకృత వ్యవసాయ మార్కెట్ భవన సముదాయ (Integrated Agricultural Market Building Complex)న్ని నిర్మిస్తున్నారు. ప్రతి దుకాణంలో సహజ వెలుగులు (Natural lights) విరజిమ్మేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకంగా బయో ప్లాంటు (Bio plant)ను ఏర్పాటుచేసి విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు. పునర్వినియోగించగల (రీసైక్లింగ్ ) సామగ్రి (Recycling material)తో రూ.19.80 కోట్లతో 1.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన సముదాయ నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.
యూవీ ఫిల్టర్ డూమ్
ఈ సముదాయంలో 174 దుకాణాలతో పాటు 400 మంది చిరు వ్యాపారులు కూరగాయలు, పండ్లు, పూలు విక్రయించేలా ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. సూర్యకాంతిని గ్రహించేందుకు 9,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో జర్మన్ టెక్నాలజీ (German Technology)తో 10 ఎంఎం మందం గల యూవీ (అల్ట్రావాయిలెట్) ఫిల్టర్ డూమ్ (UV Filter Doom)ను అమర్చారు. భవనంపై ఏర్పాటు చేసిన సన్‌లైట్ పైప్స్ (Sunlight Pipes) .. ప్రత్యేక లేజర్ గొట్టం ద్వారా ప్రతి దుకాణంలో వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆరు ఎయిర్ వెంటిలేటర్ బ్లోయర్స్ (Air Ventilator Blowers) నిర్మాణం ద్వారా నిమిషానికి 26 సార్లు లోపల గాలిని ఫిల్టర్‌చేసి బయటికి పంపే వెసులుబాటు ఉంది.
రిసైక్లింగ్ ఇటుకలు
దుకాణాల్లో ఎప్పుడూ 24- 26 డిగ్రీల గది ఉష్ణోగ్రత ఉండటం వల్ల విద్యుత్తుపై ఆధారపడాల్సిన అవసరం లేదు. భవన సముదాయ నిర్మాణంలో సిమెంట్, స్టీల్ వాడకాన్ని తగ్గించటానికి ఫ్యాబ్రిక్ డస్ట్ (Fabric Dust)తో తయారైన రీసైక్లింగ్ ఇటుకల (Recycling bricks)ను వినియోగించారు. ఇంత అత్యాధునికంగా నిర్మించినా ఒక చదరపు అడుగుకు అతి తక్కువగా రూ.1,500 ఖర్చు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భవన నిర్మాణం గురించి ఐజీబీసీ (ఇంటిగ్రేటేడ్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్) రేటింగ్ సంస్థకు పంపించామన్నారు. కనీస రేటింగ్ వచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా రూ.5 కోట్లు మంజూరవుతాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: Genome Valley: టీకాలు, ఔషధాలకు ప్రపంచ రాజధాని.. పరిశోధనలు, ఆవిష్కరణల్లో మేటి