కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ నెల 19 నుంచి చేపట్టనున్న జన ఆశీర్వాద యాత్ర ఇంఛార్జీగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డి.. తొలిసారి రాష్ట్ర పర్యటనకు విచ్చేస్తున్నారు. ముందుగా రేపు దిల్లీ నుంచి నేరుగా తిరుమలకు చేరుకుంటారు. 19న తిరుమల శ్రీవారి దర్శనం, విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సూర్యాపేట చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
కోదాడలో కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం, జాతీయ నాయకత్వం సూచన మేరకు కోదాడ నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నారు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ- అభివృద్ధి అంశాలను ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో..
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా 20వ తేదీ ఉదయం దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా కిషన్ రెడ్డి వరంగల్ చేరుకుంటారు. అక్కడ భద్రకాళీ మాత దర్శనం చేసుకుంటారు. వరంగల్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వ్యాక్సినేషన్ సెంటర్‌ను కిషన్ రెడ్డి సందర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండకు బయల్దేరి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించనున్నారు.
హన్మకొండ నుంచి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్లాషాపూర్కు వెళ్లి సర్వాయి పాపన్న కోటను పరిశీలిస్తారు. అక్కడి నుంచి యాత్ర.. జనగామ మీదుగా ఆలేరుకు చేరుకుంటుంది. ఆలేరులో పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కళాకారులు చింతకింది మల్లేశంను కిషన్ రెడ్డి కలవనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనానంతరం రాత్రి అక్కడే బస చేయనున్నారు.
21న ముగింపు సభ..
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా 21న ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కిషన్ రెడ్డి రేషన్ దుకాణాలకు వెళ్లి పరిశీలిస్తారు. ఘట్కేసర్, ఉప్పల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి ఆరోజు రాత్రి 7గంటలకు యాత్ర చేరుకుంటుంది. అక్కడ ముగింపు సభ నిర్వహించనున్నారు.
12 జిల్లాలు, 7పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 324 కిలోమీటర్ల జన ఆశీర్వాద యాత్రలో.. భాజపా నేతలు బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్‌తో పాటు రాష్ట్ర నాయకత్వం పాల్గొంటుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని భాజపా పిలుపునిచ్చింది.
ఇదీ చూడండి: Kishan reddy: కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర.. కోదాడ టు హైదరాబాద్