సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నిక పోరు పార్టీల మధ్య తీవ్రంగా ఉంది. దీనితో ఇక్కడ అధికారులు విధులు నిర్వర్తించడం కష్టంగా మారింది. హుజూర్నగర్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌పై తాజాగా ఫిర్యాదులు రావడం వల్ల ఎన్నికల సంఘం అతన్ని సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ పంపింది. సీఐ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈనెల 11న 200 కాటన్ల మద్యం పట్టుబడింది. ఎన్నికల నియామావళి అమలు ఉన్న ప్రాంతంలో అక్రమంగా లిక్కర్ రావడం అడ్డుకోవడంలో విఫలమయ్యారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఈసీకి ప్రతిపక్ష పార్టీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ ఆరోపణలతో సీఐ శ్రీనివాస్‌ను విధుల నుంచి తొలగించాలని ఈసీ సిఫారసు చేసింది. ఈ సిఫారసుపై స్పందించిన ఎక్సైజ్ కమిషనర్ సీఐ శ్రీనివాస్‌ను నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫిసర్‌కు సరెండర్ చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారించి వారంలోగా నివేదిక ఇవ్వాలని కమిషనర్.. డిప్యూటి కమిషనర్‌కు ఆదేశాలిచ్చారు. శ్రీనివాస్ స్థానంలో నల్గొండ ఎన్ఫోర్సుమెంట్ సీఐ భరత్ భూషణ్‌కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.