Second Day Of Peddagattu Jathara: సూర్యాపేట పురపాలిక పరిధిలోని దురాజ్‌పల్లి వద్ద గల పెద్దగట్టుపై కొలువై భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న లింగమంతుల స్వామి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. జాతరకు తీసుకొచ్చే దేవర పెట్టెకు సూర్యాపేట మండలం కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై భేరీలు మోగించి దేవరపెట్టెను పెద్దగట్టుకు తరలించే శోభాయాత్రను ప్రారంభించారు.
అనంతరం భక్తి శ్రద్దలతో హక్కుదార్లు, పూజారులు, భక్తులు పెద్దగట్టుకు అందనపు చౌడమ్మ పెట్టెను చేర్చారు. దేవరపెట్టెను తాకి కళ్లకు అద్దుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు పోటీపడ్డారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం పెట్టెను ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ప్రారంభం కావడంతో అర్ధరాత్రి నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Peddagattu Jathara: లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక దుస్తులైన గజ్జెల లాగులు ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. డప్పుల మోతలు, భేరీల విన్యాసాలతో వాయినాలు నిర్వహించారు. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మార్మోగి పోతుంది. రెండేళ్లకోసారి జరిగే జాతర వేడుకలు మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ.
రాష్ట్రంలో సమ్మక్క సారక్క తర్వాత రెండో అతిపెద్ద జాతరగా దురాజ్ పల్లి లింగమంతుల స్వామి గుర్తింపు పొందింది. జాతర వేళ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా విజయవాడ వైపు వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద ఖమ్మం జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. ఆర్టీసీ బస్సులను మాత్రం సూర్యాపేట బస్టాండ్ వరకు అనుమతిస్తున్నారు. పెద్దగట్టుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న తరుణంలో 1850 మంది సిబ్బందితో పోలీసులు భారీ బద్రతా ఏర్పాట్లు చేశారు.
రెండో రోజైన సోమవారం బోనాలు చెల్లింపునకు భారీగా భక్తులు హాజరుకానున్నారు. మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఆతర్వాత ఐదోరోజు మకర తోరణం తిరిగి కేసారం తరలింపు కార్యక్రమ ఊరేగింపుతో జాతర ముగియనుంది.
ఇవీ చదవండి: