భారత్ - చైనా సరిహద్దులో కర్నల్ సంతోష్‌బాబు మృతిచెందడం మాజీ సైనికాధికారుల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి చెందిన అనేకమంది సైనికాధికారులు దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలున్నా కర్నల్‌స్థాయి అధికారి చనిపోవడం మాత్రం ఇదే ప్రథమం.
కార్గిల్ యుద్ధంలో మేజర్ పద్మపాణి ఆచార్య ప్రాణాలు కోల్పోగా తర్వాత 2002 సంవత్సరంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో నగరానికి చెందిన కెప్టెన్ వీరరాజారెడ్డి మరణించారు. 2015లో కుత్బుల్లాపూర్‌లోని సూరారం ప్రాంతానికి చెందిన మేజర్ తాహిర్ హుస్సేన్‌ఖాన్ కశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
నిజానికి పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్తత ఉంటుందని, కానీ చైనా సరిహద్దుల్లో సాధారణంగా అటువంటిదేమీ ఉండదని మాజీ సైనికాధికారులు చెబుతున్నారు. అడపాదడపా ఇరు దేశాల సైనికుల మధ్య కొంత ఘర్షణ జరిగినప్పటికీ ఇలా చనిపోయిన ఘటనలు మాత్రం ఈ మధ్యకాలంలో లేవని ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి శ్రీనేష్‌కుమార్ తెలిపారు. సంతోష్‌బాబు మృతికి రాష్ట్ర హోంశాఖ, జైళ్లు, అగ్నిమాపక, సైనిక సంక్షేమశాఖ అధికారి మహ్మద్ మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. చిన్నవయసులోనే కర్నల్‌స్థాయికి ఎదిగి వీరమరణం పొందడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గాల్వన్ లోయకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?