గుర్రబోడు తండా భూములను గిరిజనులకే కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుర్రంబోడు లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొంతమంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల అండతో భూబకాసురులు గిరిజనులను తరమాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుని గిరిజనులకే అప్పజెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
గిరిజనులను తరిమేసే కుట్ర:
నాగార్జునసాగర్ ముంపులో భూమి కోల్పోయిన 100 మంది భూనిర్వాసితులకు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో 1874 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. గిరిజనులు 70 ఏళ్లుగా సేద్యం చేస్తూ జీవిస్తున్నారని ఆయన తెలిపారు. వీరి సమస్య పరిష్కరించకపోవడంలో ప్రభుత్వాల వైఫల్యం, గిరిజనులపై నిర్లక్ష్యం కనపడుతోందని అన్నారు. గిరిజనులను తరిమివేయాలనే కుట్రలో భాగంగా దాదాపు 500 ఎకరాలు బయటివారి పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తమ్మినేని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను కూడా వారికే అప్పజెప్పి, రక్షణ కల్పించాలన్నారు.