సూర్యాపేట జిల్లాకు చెందిన కొందరు కరోనా బాధితులు ఏడు రోజుల వ్యవధిలోనే కోలుకున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి చెందిన ఓ బేకరి యజమానికి కూరగాయల మార్కెట్ వ్యాపారుల నుంచి కరోనా వైరస్ సోకినట్లు అనుమానించి ఈనెల 16న నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించగా పాజిటివ్ వచ్చింది. అక్కడి వైద్యాధికారులు బాధితుని నుంచి మరోసారి నమూనాలు సేకరించినట్లు తెలిసింది. ఈసారి నెగెటివ్ ఫలితాలు వస్తే ఇంటికి పంపిస్తామని వైద్యులు చెప్పినట్లు బాధితుడు తెలిపారు.
ఆత్మకూర్(ఎస్) మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడి విషయంలోనూ ఇలాగే జరిగినట్లు సమాచారం. ఈనెల 14న బాలుడికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా ఫలితాలు వెలువడ్డాయి. 20న జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కరోనా సోకిన వారు కోలుకోవడానికి రెండు నుంచి నాలుగు వారాలు సమయం పడుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. సాంకేతిక లోపాలతో ఫలితాల్లో తేడాలు వచ్చాయా.. లేక వాస్తవంగా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకున్నారా అనే అంశంపై వైద్యాధికారులు తేల్చాల్సి ఉంది.
ఈ విషయమై సూర్యాపేట జిల్లా వైద్యాధికారి సాంబశివరావు మాట్లాడుతూ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే వైరస్ ఇంక్యుబేషన్ టైం పూర్తయితే నెగిటివ్ ఫలితాలు వస్తాయని వివరించారు. రెండు నుంచి మూడు సార్లు నెగిటివ్ ఫలితాలు వచ్చిన తర్వాతనే డిశ్చార్జ్ చేస్తారని.. అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్థానికంగా మరో 14 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉంచుతామని డీఎంహెచ్‌వో వివరించారు.