ఏదైనా ఆటంకం కలుగుతుందా..?
డిమాండ్ల సాధన కోసం గత పది రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల వల్ల సభకు ఏదైనా ఆటంకం ఉంటుందా అన్న కోణంలో తెరాస వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పోలీసులు పది, పదిహేను బృందాలుగా ఏర్పడి నియోజవర్గాన్ని జల్లెడ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక ఉప ఎన్నిక ఉండటం వల్ల... ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఖర్చులు అభ్యర్థి ఖాతాలోనే చేరతాయన్న ఉద్దేశంతో కేటీఆర్ రోడ్ షోలు రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలు నిర్వహించే ప్రతి కార్యక్రమంపైనా డేగ కన్ను వేసిన ఐఆర్ఎస్ బాలకృష్ణన్.. పైసా పైసా లెక్కిస్తున్నారు. ఇప్పుడు సీఎం పర్యటన ఖర్చులు కూడా అభ్యర్థి ఖాతాలోనే పడే అవకాశముంది. అందుకే ముఖ్యమంత్రి సభను పటిష్ఠ భద్రత నడుమ సాదాసీదాగా నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే సీఎం రాకతో తమ గెలుపు అవకాశాలు పెరుగుతాయన్న భావన ఆ పార్టీ నేతల్లో కనపడుతోంది.
ప్రత్యేక నిధులు ప్రకటిస్తారా..!
కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను గెలిచిన గత మూడు పర్యాయాల్లో.. మూడున్నర వేల కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. అధికారంలో ఉన్న తెరాస గత ఆరేళ్లలో ఏనాడూ హుజూర్ నగర్‌ను పట్టించుకోలేదని... ఇప్పుడు ఉప ఎన్నికల పేరిట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా విమర్శిస్తున్నారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను ప్రధాన అంశాలుగా చెప్పుకుంటున్న తెరాస.. వాస్తవానికి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏం చేశామన్నది వివరించలేకపోయింది. ఇదే ప్రధాన ప్రచారాస్త్రంగా హస్తం పార్టీ చేసుకోవడం వల్ల.. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు, నిధులు ప్రకటిస్తారా అనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!