RS Praveen Kumar on paddy: రైతులు, యువత, మహిళలు అన్ని వర్గాలను తెరాస సర్కార్ మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం పొనుగోడులో పర్యటించారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయని ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. మిల్లర్లతో కుమ్మక్కైన వడ్ల వ్యాపారులు.. రైతులకు మద్దతు ధర రాకుండా నిండా ముంచుతున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రైతుల వరి ధాన్యం కొనకుండా ప్రభుత్వం నాటాకాలాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
తెరాస పాలనలో ప్రజలు చాలా చితికిపోయి ఉన్నరు. ప్రతి గింజను కొనాల్సిందిపోయి వాళ్లను మిల్లర్లకు బలి చేస్తున్నరు. వ్యాపారులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ముంచుతున్నరు. తెలంగాణ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతున్నది. ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మక్కయ్యారు. చివరికి 1980 క్వింటాలుకు ఇవ్వాల్సిన చోట 13, 14 వందలు ఇస్తున్నరు. సూర్యాపేటలో రైతులు వడ్లను దగ్ధం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త
ఇదీ చూడండి: TRS Deeksha: దిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెరాస దీక్షకు ఏర్పాట్లు