సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర కేబినేట్ మంత్రిగా ఎదిగిన కిషన్ రెడ్డి (Cabinet Minister Kishan Reddy) ప్రతి ఒక్కరికి ఆదర్శమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కొనియాడారు. కష్టపడే వ్యక్తిత్వం వల్లే ప్రధాని మోదీ (Pm Modi) కిషన్‌రెడ్డిని గుర్తించి కేంద్ర కేబినేట్లోకి తీసుకున్నారని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర (Jan Ashiravad Yatra)లో భాగంగా కోదాడలో ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ ప్రసంగించారు.
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడానికి వెనుకాడలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు అమలు కావడంలో కిషన్ రెడ్డి కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కష్టపడి పనిచేసినందు వల్లే హోంశాఖ సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారని గుర్తుచేశారు.
ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పినందుకే జన ఆశీర్వాద యాత్ర చేపట్టినం. కోదాడ ప్రజల ఆశీర్వాదం పొందాలని.. కిషన్‌రెడ్డి ఇవాళ ఇక్కడికి వచ్చారు. 28 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు, 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు కేంద్ర మంత్రులుగా అవకాశమిచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీది. ఇవి కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. ఒక సామాన్య కార్యకర్త ఇవాళ దేశ ప్రధానిగా ఉన్నారు. టీలు అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యుండు అంటే అది భాజపాతోనే సాధ్యం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయడు. ఓ సినిమాలో డైలాగ్ ఉంటది. ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరుగుతదో వాడు పండుగాడు అని. రాష్ట్రంలో ఇవాళ ఇదే పరిస్థితి ఉన్నది. ఎవడు సంక్షేమ పథకాలు పెట్టి ఏం చేయడో వాడే కేసీఆర్. ప్రజలకు ఐస్‌క్రీమ్ చూపిస్తడు కేసీఆర్. అరే అది మనకోసమే అనుకుని ఆగమాగం ఉరికివస్తం. మనం వచ్చేలోపే తింటడు. ఏమైందంటే మీరొచ్చేలోపే కరిగిందని చెప్తడు. కేసీఆర్ ఐస్‌క్రీమ్ తిని పుల్ల మన చేతిల పెడ్తడు. లేకపోతే ఇంకోమాట చెప్తడు. బీజేపీ వాళ్లు కిందపొగ పెట్టిండ్రు అందుకే కరిగిందని అంటడు. కేసీఆర్‌కు మేం పొగపెడ్తం... అందుకే ఇవాళ గడీల నుంచి, ఫాంహౌజ్‌ల నుంచి బయటకొచ్చి పేదప్రజల కోసం పనిచేస్తా అని ప్రచారం చేసుకుంటుండో దాని వెనుక ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ.
-- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: Kishan Reddy Tour: తెలంగాణలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం