హుజూర్నగర్ ఉపఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ... ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రచారంలో ఎక్కడా తగ్గకుండా... ఒకరికి మించి మరొకరు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. పోలింగ్‌కు ముందు 48 గంటలు ఎంత కీలకమో... చివరి దశ ప్రచారమూ అంతే ముఖ్యం. ప్రచార పర్వం ముగింపునకు మూడురోజులే ఉండటం వల్ల... ఆయా పార్టీల ముఖ్యనేతలను రంగంలోకి దించుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలాంటి ముఖ్యనేతలు రంగ ప్రవేశంతో ప్రచారం మరింత ఉద్ధృతమవనుంది.
ఖాతా తెరిచే దిశగా తెరాస ప్రయత్నాలు...
మొదటిసారి పాగా వేసేందుకు గులాబీ దండు యత్నిస్తుంటే... కంచుకోటను కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఇలా రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులన్న తీరుగా వ్యవహరిస్తుండటంతో... పల్లెలన్నీ నాయకగణంతో హోరెత్తుతున్నాయి. కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు... నాయకులంతా సమష్టిగా కష్టపడుతున్నారు. తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించి... కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్న భావన గులాబీ నేతల్లో కనిపిస్తోంది.
ఏకతాటిపైకి హస్తం నేతలు...
హస్తం హవా కొనసాగించేందుకు ఉత్తమ్... తీవ్రంగా శ్రమిస్తున్నారు. సతీమణిని గెలిపించుకునే వ్యూహంలో భాగంగా... పార్టీకి చెందిన కీలక నేతలందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు. యువతను ఆకట్టుకోవడమే కాకుండా... ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రేవంత్ రెడ్డి... రేపు, ఎల్లుండి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అటు సీఎం ద్వారా ఓట్లు రాబట్టాలని భావిస్తున్న తెరాసకు దీటుగా... రేవంత్, భట్టి వంటి ప్రధాన నేతల రాకతో ఓట్లు సాధిస్తామనే ధీమా హస్తం నేతల్లో అవగతమవుతోంది.
స్తబ్ధుగా ప్రచారాన్ని ప్రారంభించిన భాజపా... తుది దశలో దూకుడు పెంచింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు ఇప్పటివరకు ఎంపీలు సంజయ్, అర్వింద్ ప్రచార బాధ్యతల్ని మోస్తున్నారు. వీరికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జత కానున్నారు. శుక్రవారం ఆయన పలు మండలాల్లో పర్యటించనున్నారు. అటు తెలుగుదేశం పార్టీ సైతం... నందమూరి బాలకృష్ణను రంగంలోకి దించాలని చూస్తోంది. కానీ ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇలా నాలుగు ప్రధాన పార్టీల ప్రచారంతో... వచ్చే మూడు రోజులు హుజూర్ నగర్ నియోజకవర్గం సందడిగా మారబోతోంది.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష