అనుకున్నది సాధించేదాకా పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నించడానికి ఈయన నిలువెత్తు ఉదాహరణ. సూర్యాపేట పట్టణానికి చెంది మర్రి రెహేమియా వయసు 70 ఏళ్లు. కాగా... ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలన్నింటిలోనూ పోటీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 17 సార్లు వివిధ చోట్ల నుంచి బరిలో నిలిచాడు.
18 వ సారి సాగర్లో...
ప్రతీ సారి ఓడిపోయిన... పట్టువదలని విక్రమార్కుడిలా... విజయం సాధించేందుకు పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉపఎన్నికల బరిలో 18వ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. బుధవారం రోజున నిడమనూరులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేయడానికి రెహేమియా... నామపత్రాలు తీసుకున్నారు.
1984 నుంచి 2021 వరకూ...
1984 లో మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం ఏర్పడ్డ నాటి నుంచి 7 పర్యాయాలు ఎంపీగా పోటి చేసి అనంతరం అదే పార్లమెంట్ స్థానం నల్గొండగా రూపుదిద్దుకున్నాక... కూడా అక్కడి నుంచి 4 సార్లు పోటీ చేశారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు, నకిరేకల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు, తుంగతుర్తి నుంచి ఒక సారి బరిలో నిలిచారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో పోటీకి నిలిచేందుకు నామినేషన్ వేయగా... అది తిరస్కరణకు గురైంది.
రెహేమియాకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తాను గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానని మర్రి రెహేమియా ఉద్ఘాటించారు.