Paddy Damage in Suryapet : సూర్యాపేట జిల్లా మునగాలలోని ఓ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం మొలకెత్తింది. వానాకాలం సీజన్లో పలు ఐకేపీ కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లు ఆవరణలో ఆరుబయట నిల్వచేశారు. దాదాపు 30వేల క్వింటాళ్ల ధాన్యానికి మొలకలు వచ్చాయి. ఏం చేయాలో పాలుపోని మిల్లు యజమాని అశోక్.. అధికారులకు సమాచారం అందించారు.
Paddy Damage in Munagala : రైస్ మిల్లుకు వచ్చి ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు.. ఆరు బయట నిల్వచేసినందున బీమా వర్తించదని చెప్పినట్లు బాధితుడు వాపోయాడు. ధాన్యం తడవకుండా పట్టాలు కప్పినా.. ఇటీవల కురిసిన వాన, మంచుకు ధాన్యం మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు మొలకెత్తిన ధాన్యం ఖరీదు.. 12 కోట్లు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి తనకు సాయం చేయాలని వేడుకున్నాడు.
'మొన్న కురిసిన వానలకు ఖరీఫ్‌లో ఐకేపీ కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యం బస్తాలపై.. పై నుంచి వర్షపు నీళ్లు పడ్డాయి. దాదాపు రెండు లాట్లలో నిల్వ చేసిన 30వేల క్వింటాళ్ల ధాన్యం మొలక వచ్చింది. ఈ విషయం అధికారులకు చెప్పాను. పాడైన ధాన్యాన్ని పక్కకు పెట్టమన్నారు. ధాన్యం కొరత తీర్చాలని కోరాను. సాయం చేస్తామని చెప్పారు. ధాన్యం బయట నిల్వ చేయడం వల్ల ఇన్సూరెన్స్ రాదని చెప్పారు. ఐకేపీ కేంద్రాల నుంచి మంచి ధాన్యమే వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు వర్షపు నీళ్లు లీకై.. ధాన్యంపై కప్పిన పట్టాల నుంచి లోపలికి వెళ్లడం వల్ల ధాన్యమంతా మొలకెత్తింది. ప్రభుత్వమే దయచూపి నాకు దారి చూపాలి.' - అశోక్, రైస్ మిల్లు యజమాని
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!