సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ నిర్వాసితులకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిర్మించిన పునరావాస కాలనీలో ఓ ఇంటి గోడ కూలింది. ఆ సమయానికి ఎక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిర్మాణాలు జరిగిన కొద్దీ నెలలకే ఇలాంటి ఘటనలు జరగడంతో పునరావాస కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామస్థులకు ఇటీవలే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన పునరావాస కాలనీలో రెండు పడక గదుల ఇళ్లు కేటాయించారు.
ఇందులో పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గొల్లపల్లి నర్సింహులుకు చెందిన ఇంటి మెట్ల గోడ ఆదివారం కురిసిన వర్షానికి కూలింది. ఈ విషయమై స్థానిక ఆర్డీవో విజయేందర్ రెడ్డిని వివరణ కోరగా గోడ కూలి పోవడానికి గల కారణాలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ కష్టకాలంలో అన్నార్తుల ఆకలితీరుస్తున్న మానవతావాదులు