సూర్యాపేట జిల్లాలో గిరిజన యువతిపై అత్యాచారం, హత్య చేసిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని అంబేడ్కర్ కూడలి వద్ద గిరిజన సంఘాలు ధర్నా నిర్వహించారు. ఈ విషాద ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇంతవరకు నిందితునికి శిక్ష పడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగకుంటే రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఆందోళనలు ఉద్ధృతం చేస్తాయని హెచ్చరించారు.
అత్యాచారం హత్యకు గురైన అగ్రవర్ణాల మహిళలకు ఓ న్యాయం, దళిత గిరిజన మహిళలకు మరొక న్యాయం చేస్తున్నాయంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంఘనాయకులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా గిరిజన మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్, పరిహారం చెల్లించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు మోహన్ నాయక్, సర్పంచ్ బానోత్ సంతోష్, భాస్కర్ నాయక్ తో పాటు భాజపా మండల అధ్యక్షుడు వీరాచారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి... 20 నిమిషాలు నరకం