సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. గ్రామంలో రూ.1.57 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 25 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలు ఘనంగా జరిగాయి. సాంప్రదాయం ప్రకారం వైదిక పూజా కార్యక్రమాలు చేపట్టి పండుగ వాతావరణంలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
నూతన గృహాలు బాగున్నాయా ?
గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు మంత్రి మిఠాయిలు తినిపించారు. కొత్త ఇళ్లు ఎలా ఉన్నాయంటూ లబ్ధిదారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. రూ 14.80 లక్షల వ్యయంతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్మించిన రెండు అదనపు గదులను, అనంతరం డిజిటల్ తరగతి గదులను ప్రారంభించారు. గ్రామంలో రూ. 30లక్షల వ్యయంతో నిర్మించనున్న కేజీబీవీ బాలికల విద్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అత్యంత వెనుకబడిన వారికే కేటాయించాం...
రాఘవాపూర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని అత్యంత నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించామని వివరించారు. డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులు ఓ కమిటీ వేసుకుని, ప్రతీ ఇంటి నుంచి కొంత మొత్తం వసూలు చేసుకోవాలని సూచించారు. ఆ డబ్బును కమిటీ ఆధ్వర్యంలో కాలనీ అభివృద్ధికి వెచ్చించాలని కోరారు. కాళేశ్వరం నీటి ద్వారా చెరువులు నింపి.. రెండు పంటలు పండించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యాసంగి పంటకు కాళేశ్వరం నీళ్లు తెస్తామన్నారు. రోడ్ల నిర్మాణం పనులు దశల వారీగా చేపడతామన్నారు.
ఇవీ చూడండి : ఈ నెల 23 నుంచి హైదరాబాద్‌లో బుక్‌ఫెయిర్