ప్రశ్న: దుబ్బాక ఉప ఎన్నిక కోసం తెరాస అందరికంటే ముందే రంగంలోకి దిగిందా..?
జవాబు: దుబ్బాక తెరాసకు కంచు కోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టారు. గెలుపు అన్నది మాకు సమస్యే కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 62వేల మెజార్టీ వస్తే.. పార్లమెంట్ ఎన్నికల నాటికి 72వేల అధిక్యం వచ్చింది. మా విజయం తేలిపోయింది. తేలాల్సింది రెండో స్థానం ఎవరిదనేదే.
ప్రశ్న: మీ అభ్యర్థి ఎంపికపై స్పష్టత వచ్చిందా..?
జవాబు: అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారు. వారి నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తాం.
ప్రశ్న: మీ ఎన్నికల అస్త్రాలు ఏమిటి? మీ టార్గెట్ భాజపానేనా?
జవాబు: మాకు కాంగ్రెస్.. భాజపా అనే తేడా లేదు. గత ఎన్నికల్లో భాజపా మూడోస్థానంలో నిలిచింది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు. ప్రజల్లో విశ్వసనీయత లేదు. దీనికి తోడు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు వారి పరిస్థితని మరింత దిగజార్చాయి. వీటిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితిలో గతంలో వచ్చిన ఓట్లను సైతం భాజపా దక్కించుకోలేదు.
ప్రశ్న: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. విజయం తమదేనని భాజపా అంటోంది. దీనిపై మీ స్పందన.?
జవాబు: కరోనా వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు భృతి ఇస్తున్నాం. కేవలం దుబ్బాక నియోజకవర్గంలోనే 20వేల మంది బీడీ కార్మికులకు భృతి.. 59వేల మందికి ప్రతి నెల రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. గత వానకాలంలో సాగుకు 78వేల మంది రైతులకు రైతుబంధు వేశాం. రైతులకు 5లక్షల రూపాయల బీమా, సాగుకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇవా ప్రజా వ్యతిరేక చర్యలు. భాజపా గ్లోబెల్స్ ప్రచారం చేస్తుంది. గతంలోనూ ఇలాంటివి చెప్పే మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఈసారి కూడా అదే పునరావృతం కానుంది.
ప్రశ్న: కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్రం తమ పేరు చెప్పుకుంటోందని అంటుంది. దీనికి మీ సమాధానం.?
జవాబు: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల కోసం ఏడాదికి 11,400 కోట్లు ఖర్చు చేస్తోంది. దీని కోసం కేంద్రం 220కోట్ల రూపాయలు ఇస్తోంది. రెండు వేల రూపాయల పింఛన్లో కేంద్రం వాటా కేవలం రూ.1.90లోపే. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 10వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఆ నిధులు ఇస్తే చాలు. రాష్ట్రం కట్టిన జీఎస్టీలో రావాల్సిన వాట 6వేల కోట్లు, ఐజీఎస్టీలో 2800 కోట్లు, బీఆర్జీఎఫ్లో 450కోట్లు, 14పైనాన్స్ కమిషన్లో 850కోట్లు.. ఇలా దాదాపు 10వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. భాజపా నాయకులు ఈ మొత్తం ఇప్పించిన తర్వాతే.. దుబ్బాకలో ఓట్లు అడగాలి.
ప్రశ్న: జీఎస్టీలో ఏ ఆఫ్షన్ ఎంచుకోబోతున్నారు?
జవాబు: కేంద్రం ఇచ్చిన రెండూ ఆఫ్షన్లు నిరూపయోగమే. వీటి వల్ల రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా అదనంగా రాదు. పార్లమెంటులో చేసిన చట్టం ప్రకారం 14శాతం గ్రోత్ రేటు అధారంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాల్సిందే.
ప్రశ్న: ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అంచనా వేస్తున్నారు?
జవాబు: నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాలతో మేము ముందుకు పోతాం.