సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. రామలింగా రెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి స్వస్థలానికి తరలించారు. పాత్రికేయుడుగా పని చేసిన రామలింగా రెడ్డి కేసీఆర్ పిలుపుతో స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004ఎన్నికల్లో దొమ్మాట నుంచి బరిలోకి దిగి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పిలుపుతో 2008లో తన పదవికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా
నియోజకవర్గాల పునర్విభజనలో దొమ్మాట.. పోయి కొత్తగా దుబ్బాక నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటి చేసి.. ఓటమి పాలయ్యారు. తదనంతరం జరిగిన 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోలిపేట.. ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో రామలింగా రెడ్డి కీలక పాత్ర పోషించారు. తన సహచర ఎమ్మెల్యేలైన హరీశ్ రావు, పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి స్వరాష్ట్రం కోసం పోరాటం చేశారు. కేసీఆర్ అమరణ నిరాహర దీక్ష చేపట్టిన సమయంలో.. సిద్దిపేటలో రామలింగారెడ్డి సైతం దీక్షకు కూర్చున్నారు. ఉద్యమ సమయంలో పలుమార్లు అరెస్టై.. జైలుకు సైతం వెళ్లారు.
అధిక మొత్తంలో నిధులు
దుబ్బాక నియోజకవర్గంపై రామలింగారెడ్డి తన ముద్ర వేశారు. దుబ్బాకతో కేసీఆర్‌కు ఉన్న అనుబంధంతో నియోజకవర్గ అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు తీసుకురాగలిగాడు. ప్రజలు, కార్యకర్తల సమస్యలను సాదావహంగా వింటారని.. వారి కోసం ఎంత సమయమైనా వెచ్చిస్తారని రామలింగారెడ్డికి గుర్తింపు ఉంది.
ఈ రోజు రామలింగారెడ్డి స్వస్థలం చిట్టాపూర్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి : పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానికులకే..