కరోనా వ్యాప్తి నివారణపై అవగాహన కోసం సిద్దిపేటలోని ప్రభుత్వ, ప్రైవేటు, మెడికల్ కళాశాల వైద్యులకు విడతల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, సీపీ జోయల్ డేవిస్, వివిధ శాఖల ఉన్నాతాధికారులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టిన, చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, మందులు తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో ఉన్న మూడు మెడికల్ కళాశాలల సేవలను సద్వినియోగం చేసుకోవాలని... అన్ని నియోజకవర్గాల్లోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కలెక్టర్ అధ్యక్షతన రెండు కమీటీలు వేశారు. మొదటి కమిటీ అధ్యక్షుడిగా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ ఆధ్వర్యంలో మౌళిక వసతుల కల్పన, ప్రాంతాల ఎంపిక ఇతరత్రా సదుపాయాలు... రెండో కమిటీ అధ్యక్షుడిగా అడిషనల్ కలెక్టర్ ముజాంబీల్ ఖాన్ ఆధ్వర్యంలో మందుల కొనుగోలు, వెంటిలేటర్లు తదితర అంశాలు చూస్తారని మంత్రి వివరించారు.
జిల్లాకు మరో ట్యాంకు సోడియం హైపో క్లోరైడ్ మందును తెప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా పోలీసుల కోసం మరో 10 వేల శానిటైజర్లను తెప్పించి పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్ కేంద్రం!