సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి... తరలించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య పరీక్ష కేంద్రాన్ని తిరిగి హుస్నాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మున్సిపల్ ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.
గత 15 ఏళ్ల నుంచి హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగిన డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ దూరవిద్య పరీక్ష కేంద్రాన్ని స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో 2 సంవత్సరాల క్రితం సిద్దిపేట జిల్లా కేంద్రానికి తరలించారని అన్నారు. అందువల్ల హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి గర్భిణీలు, వృద్ధులు ఇబ్బందులు పడుతూ సుమారు 50 కిలోమీటర్ల దూరం వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తోందని తెలిపారు. ఓసారి ఈ క్రమంలో ఓ గర్భిణి.. కళ్లు తిరిగి పడిపోయి పరీక్ష రాయలేక పోయిందని విద్యార్థులు వాపోయారు.
ఎమ్మెల్యే దృష్టికి కూడా పరీక్ష కేంద్రం ఏర్పాటు విషయాన్ని తీసుకెళ్లామని ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తిరిగి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.