అక్కడ పాఠాలు మన పరిసరాల్లో పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తాయి. సొంతింటిలో రోజూ పోగుపడి అనారోగ్యాలకు కారణమయ్యే చెత్తను మొక్కలకు ఉపయోగపడే ఎరువులుగా ఎలా మార్చుకోవచ్చో నేర్పుతాయి. వాటి నుంచి ఆదాయం పొందడమెలాగో కూడా వివరిస్తాయి. ఇంతటి బృహత్ బోధనలకు సిద్దిపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛబడి వేదికగా నిలిచింది. పర్యావరణవేత్త డాక్టర్ శాంతి నేతృత్వంలో ఇది పురుడుపోసుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చొరవతో ఈ ఏడాది ఏప్రిల్‌లో సుమారు రూ.85 లక్షల వ్యయంతో పట్టణంలోని 39వ వార్డులో ఈ బడిని ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ స్వచ్ఛతపై పాఠాలు బోధిస్తున్నారు. ఇటువంటి బడి తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిది.
ఉదయం 10 నుంచి..
స్వచ్ఛబడిలో పాఠాలు చెప్పేందుకు స్థానిక వైద్యులు స్వామి, ఉపాధ్యాయులు రాధారి నాగరాజు, కౌన్సిలర్ దీప్తి, న్యాయవాది అశోక్, ఉదయ్ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. బడిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం మూడు తరగతులు జరుగుతాయి. ప్రతి రోజు పట్టణంలోని మూడు వార్డుల నుంచి 150 మంది ప్రజలు వస్తున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో తరగతిలో 50 మంది పాఠాలు వినేలా సౌకర్యాలు కల్పించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ ఎరువు తయారీ, మిద్దెతోటల పెంపకం, జీరోవేస్ట్ మేనేజ్‌మెంట్, ఇళ్లు, అపార్టుమెంట్లు, కాలనీలు, వార్డుల్లో తడి, పొడి చెత్త నిర్వహణ వంటి అంశాలపై డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. బడిలోనే దేశీయ విత్తనాలతో పండిస్తున్న కూరగాయల తోటను, ఎరువుల తయారీ కేంద్రాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ సహకారంతో ఓ డాక్యుమెంటరీని తీయించారు.
దేశానికే ఆదర్శంగా మార్చడమే లక్ష్యం
సిద్దిపేట మున్సిపాలిటీని స్వచ్ఛతలో దేశానికే ఆదర్శంగా నిలపాలన్న ఉద్దేశంతో చెత్త నిర్వహణపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేశాం.- హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి
ఇదీ చదవండి: CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'