కరోనా కోరల్లో చిక్కుకున్న తల్లి మృతి చెందిన మూడు రోజుల వ్యవధిలోనే కుమారుడూ మరణించిన విషాదఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కలకలం రేపింది. దుబ్బాక పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు (70) మంగళవారం రాత్రి చనిపోయారు.. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బుధవారం వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆమె ఇంట్లోని ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఈ పరిణామంతో స్వీయ గృహనిర్బంధంలో ఉన్నారు. ఈక్రమంలోనే ఆమె కుమారుడు (56) అనారోగ్యం బారినపడ్డారు.
అందరూ ఇంట్లోనే ఉన్నా..ఆయన వద్దకు ఎవరూ వెళ్లలేదు. ఎలాంటి వైద్య సదుపాయం అందక శుక్రవారం ఇంటి వద్దనే ఆయన చనిపోయారు. వైద్య సిబ్బంది, పోలీసుల నేతృత్వంలో ఆలస్యంగా చేరుకున్న అంబులెన్సులో ఆయన మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా లక్షణాలు లేకపోవడంతో ఎలాంటి పరీక్షలు చేయలేదని తెలిపారు. భయాందోళనతో మృతిచెంది ఉంటారని తిమ్మాపూర్ పీహెచ్‌సీ పర్యవేక్షకుడు రాజచైతన్య తెలిపారు.
మృతుడి కుటుంబసభ్యులకు సిద్దిపేట కొవిడ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు లేవని, ఇంటికి వెళ్లాలని వారికి సూచించారు. తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని రాతపూర్వకంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి వాహన సదుపాయం కల్పించకుండా సొంతూరికి ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి ఆర్‌ఎంవో కాశీనాథ్ దృష్టికి తీసుకెళ్లగా వాహన సదుపాయం కల్పించి దుబ్బాకకు పంపిస్తామని చెప్పారు.కాగా బంధువుతో ప్రాధేయపడిన సంభాషణ, ఆయన అంబులెన్సు సిబ్బందితో మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కరు కొట్టాయి.అంబులెన్సు సిబ్బంది వైఖరిని, ఉదాసీనతను పలువురు తప్పుపట్టారు.