సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డిలో ఆర్టీసీ బస్టాండు నిర్మించి దశాబ్దం దాటినా నిరుపయోగంగానే ఉంది. ప్రయాణ ప్రాంగణ ఆవరణమంతా చెత్తా చెదారంతో నిండిపోయి పందులకు నిలయంగా, ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారిపోయింది. బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండులో కాకుండా పక్కనే ఉన్న ఇండ్ల అరుగులపై నిలబడి వేచి చూస్తుంటారు. బస్సు డ్రైవర్లకు వారు కనపడక ఎవరూ లేరనుకొని ఎవరినీ ఎక్కించుకోకుండానే వెళ్లిపోతారు. ఈ గ్రామం మీదుగా ప్రతిరోజు సికింద్రాబాద్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట పట్టణాలకు బస్సులు వెళ్తాయి. కానీ ఏ ఒక్క బస్సు కూడా బస్టాండు లోపలికి రాదు. కారణం బస్టాండు నిర్మాణం సరైన రీతిలో లేకపోవడమే. ప్రయాణికుల సమస్యలను అర్థం చేసుకొని ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణాన్ని ఉపయోగంలోకి తెచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: రాజధానిలో పట్టపగలు, నడిరోడ్డుపై కాల్పులు!