సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని 6.37 ఎకరాలపై బాలగోని సాయికిరణ్తోపాటు మరో ముగ్గురు హక్కులు వదులుకుంటూ ఇచ్చిన రాజీనామా పత్రాలకు సంబంధించిన వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సింగిల్ జడ్జి సమర్థించటం వల్ల పట్టాదారులైన బాలగోని సాయికిరణ్ తదితరులు అప్పీలు దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 1989-90 లో అసైన్డ్ పట్టాలు ఇచ్చారని, అప్పటి నుంచి భూమి తమ స్వాధీనంలో ఉందని కోర్టుకు తెలిపారు. 2019 లో ఈ భూమి ప్రభుత్వానిదని చెప్పి.. మరొకరికి కేటాయించడం కోసం ఖాళీ చేయాలని చెప్పగా హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
అసైన్డ్ పట్టాలను స్వచ్ఛందంగా వదులుకొని భూమికి రాజీనామా చేశారన్న ప్రభుత్వ వాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పరిణామాలపై తేదీల వారీగా అఫిడవిట్ దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిద్దిపేట కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవో, కొండపాక తహసీల్దార్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది.
- ఇదీ చూడండి : బలహీన పడుతున్న ఆనకట్టలు