రెండో విడత ఇంటింటా ఫీవర్ సర్వే కార్యక్రమం అమలు తీరుపై… క్లస్టర్ ఇంఛార్జీలైన మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్ర, మెప్మా సిబ్బందితో సిద్దిపేట జిల్లా పాలనాధికారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొత్తం 2 లక్షల 90 వేల ఇళ్లలో రెండో విడత ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా సర్వేలో పాల్గొనాలని కోరారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా 666 గ్రామ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 100 మందికి పైగా పర్యవేక్షణ అధికారులుగా నియమించామని ఆయన వెల్లడించారు.
ఫీవర్ సర్వే ద్వారా లక్షణాలున్నవారిని ముందస్తుగా గుర్తించటం వల్ల వ్యాధి వ్యాప్తి నివారణతో పాటు, హోం ఐసొలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు పడుతుందన్నారు. ఇంటింటి సర్వేలో లక్షణాలున్న బాధితులకు మెడికల్ కిట్స్ అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఐదు రోజులపాటు ఏఎన్‌ఎంలు, ఆశాలు వారిని పర్యవేక్షించి లక్షణాలు తగ్గని వారికి పీహెచ్‌సీలో కరోనా క్లినికల్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరిస్థితి సీరియస్గా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు లేదా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందేలా చూడాలన్నారు.
సర్వే నివేదికలు రోజువారీగా సమర్పించాలని పాలనాధికారి కోరారు. మొదటి విడతలో వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు, కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని కూడా… రెండో విడత సర్వేలో తెలుసుకోవాలన్నారు. రెండో విడతలో వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు, కరోనా బాధితులకు మెడికల్ కిట్లు అందించి రోజూ వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయాలని పేర్కొన్నారు. ఫాలో అప్ చేయడం వల్ల బాధితుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. బాధితులు త్వరగా వ్యాధిని జయిస్తారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'కరోనా కట్టడికి అందరూ కలిసి కృషి చేయాలి'