సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో నిరసన చేపట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుండి సిద్దిపేట వరకు ఉన్న ప్రధాన రహదారి మొత్తం గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని శివసేన హుస్నాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఐలేని మల్లిఖార్జున్ మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి రహదారులు బాగు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో కిలోమీటర్ దూరం కూడా కూడా రోడ్లు సరిగ్గా లేవని ఆయన ఆరోపించారు.
మంత్రి హరీష్ రావు స్పందించి హుస్నాబాద్ నుండి సిద్ధిపేటకు గల ప్రధాన రహదారి మరమ్మతులు చేయించాలని స్థానిక ఎమ్మెల్యేకు పలుమార్లు విన్నవించినా, ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గ కేంద్రంలోనే రహదారుల పరిస్థితి ఇలా ఉంటే గ్రామాలలో పరిస్థితి ఏంటని, ఆర్అండ్బీ అధికారులు అసలు పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. హుస్నాబాద్ నుంచి కరీంనగర్, హుజురాబాద్, వరంగల్ వెళ్లే రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని… ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని వీడి ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి వెంటనే రోడ్లు బాగు చేయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్