సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీకి మంగళవారం ఓపెన్ ఏయిర్ ఆడిటోరియం వేదికైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్లు హాజరై విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదటి, ద్వితీయ బ్యాచ్ విద్యార్థులు మీరే ట్రెండ్ సెట్టర్స్ కావాలని మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. ఎంతో కష్టపడి చదివితే కానీ ఈ కళాశాలలో సీటు లభించదని, ఈ ఐదేళ్లు మీరు మా అతిథులు, మా కుటుంబ సభ్యులని అన్నారు.
ఇటీవల మెడికల్ కళాశాల సందర్శనలో భాగంగా తన దృష్టికి వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే త్వరలోనే 500 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సమాజంలో ఎన్నో రంగాల వారు ఉన్నా.. వైద్యుడు అంటే ఒక గౌరవ భావం ఉన్నదని, జన్మనిచ్చే వాడు దేవుడైతే.. పునర్జన్మనిచ్చే వాడు డాక్టరని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ అరసు, సూపరింటెండెంట్ చంద్రయ్య, మెడికల్ కళశాల డైరెక్టర్లు, ప్రొఫెసర్లు, కళాశాల అధ్యాపక బృందం, పలువురు విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు ఎన్హెచ్ఆర్సీ విముక్తి