రంగనాయక, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాల్వల భూసేకరణపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ పి. వెంకట్రామరెడ్డి, ఇరిగేషన్ ఏస్ఈ ఆనంద్, వివిధ మండలాల తహశీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రంగనాయక, మల్లన్న సాగర్ జలాశయాల కాల్వల భూసేకరణ, ప్రధానంగా 10వ ప్యాకేజీ రంగనాయక రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.
కాళేశ్వరం జలాలను జిల్లాలోని పంట పొలాలకు చేరవేసేలా పిల్ల కాల్వల భూసేకరణకై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిర్ధేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని.. వీరికి సహకరించాలని సూచించారు. మొదటగా రంగనాయక సాగర్ జలాశయం కింద ప్రధానంగా ఎడమ, కుడి కాల్వలు, పిల్ల కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కోసం అవసరమైన భూ సేకరణ చేపట్టాల్సి ఉన్నందున.. ఆయా మండల తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ భూసేకరణ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు