సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం అంబారుపేట హల్దీ వాగులోకి గోదావరి నీటిని విడుదల చేసే కార్యక్రమానికి మంగళవారం ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం అందడంతో... అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డికి నీటిని తరలించే కాలువ ద్వారా (వర్గల్ మండలం అవుసులోనిపల్లి సమీపంలో నిర్మించిన తూము ద్వారా) హల్దీ వాగుకు నీటి విడుదల చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో దాదాపు 65 కిలోమీటర్ల మేర ప్రవహించిన తరవాత హల్దీవాగు పాపన్నపేట మండలంలో ఏడుపాయల వద్ద మంజీరలో కలుస్తుంది. వాగు పరీవాహకంగా ఉన్న ఆరు మండలాల పరిధిలో దాదాపు 30 వేల మంది రైతులు సాగు చేసిన 10 వేల ఎకరాలకు ఈ నీటి ద్వారా ప్రయోజనం కలగనుంది.
ఏర్పాట్ల పరిశీలన
సీఎం ఆదేశాలతో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రతాపరెడ్డి ఆదివారం వర్గల్ మండలంలో హల్దీ వాగుకు నీటిని విడుదల చేసే తూమును స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు. హల్దీకి గోదావరి నీటి విడుదలతో వర్గల్ మండలంలో 25 చెక్‌డ్యాంలు, 10 చెరువులు పునరుజ్జీవం కానున్నాయని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్