కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 2,217 ఎకరాల విస్తీర్ణంలో రంగనాయకసాగర్ జలాశయాన్ని నిర్మించారు. ఈ ప్యాకేజీ పనులను రూ.3,300 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. 8.65 కిలో మీటర్ల మేర కట్ట నిర్మించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 490 మీటర్లు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని సొరంగంలో పంప్‌హౌస్, సర్జిపూల్ నిర్మించారు. 65 మీటర్ల లోతు, 20 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు.
పంప్‌హౌస్‌లో నాలుగు పంప్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి 134.5 మెగావాట్ల సామర్థ్యంగల మోటార్లు బిగించారు. 24 గంటల వ్యవధిలో ఒక్కో పంప్ 0.25 టీఎంసీల నీటిని రంగనాయకసాగర్‌లోకి ఎత్తి పోస్తుంది. నాలుగు పంప్‌ల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయవచ్చు. ఎల్లాయిపల్లి హెడ్‌రెగ్యులేటర్ నుంచి చంద్లాపూర్ సొరంగంలో ఉన్న సర్జిపూల్‌లో నీటిని నింపి, ఇక్కడి పంప్‌హౌస్ ద్వారా రంగనాయకసాగర్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌లను సిద్ధం చేసే ప్రక్రియ తుది దశకు చేరింది. ఒకటి, రెండు రోజుల్లో నీరు జలాశయంలోకి రానుంది.
ఇదీ చూడండి: లాక్డౌన్ కాలంలో రాచకొండ పోలీసుల మానవత్వం