ఎల్ఆర్ఎస్ పేరుతో కరోనా విపత్కర సమయంలో పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని.. అదనపు భారం మోపుతున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వారి పిల్లల చదువుల కోసమో, పెండ్లి కోసమో ఫ్లాట్లు కొనుక్కుంటే.. వాటిని ఇప్పుడు క్రమబద్దీకరించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని 131, 135 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకై నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమాలు చేసి ఎన్నో ఆశలతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే.. సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాల పేరుతో మోసం చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి ఆరున్నర సంవత్సరాలు అవుతున్నా.. పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు.