ఎల్ఆర్ఎస్ పథకం వల్ల సామాన్య ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని... తక్షణమే రద్దు చేయాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడో కొన్న ఫ్లాట్లను మళ్లీ ఇప్పుడు గజానికి కొంత డబ్బులు చెల్లించి తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా దారుణమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం, అక్కన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రాష్ట్ర భాజపా అధిష్ఠానం పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు.
ఎన్నో పోరాటాలు, బలిదానాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెరాస నిరంకుశంగా పరిపాలిస్తూ.. అప్పుల తెలంగాణగా మార్చిందన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం పేరిట 131 జీవోను తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలను అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ భాజపా పట్టణ శాఖ అధ్యక్షుడు శంకర్ బాబు, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, వేణు, మహిళా మోర్చా నాయకులు తిరుమల, అక్కన్నపేట మండలం భాజపా అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి తదితరులు పాల్గొన్నారు.