అద్భుత ఆవిష్కారం ఆచరణలేక శిథిలావస్థకు చేరుకుంటుంది. ప్లాస్టిక్‌ని సరైన విధంగా ఉపయోగించుకోవడానికి తలపెట్టగా వచ్చిన ఫలితం బాగున్నా.. సరైన ఆచరణ లేక నిర్దేశిత లక్ష్యం అందుకోవడం లేదు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో దుకాణాలు
వీధి విక్రయ వ్యాపారుల కోసం రాష్ట్రంలోనే మొదటిసారిగా సిరిసిల్ల పురపాలక సంఘంలో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్‌తో దుకాణాలు ఏడాది క్రితం తయారు చేశారు. 37 టన్నులతో 53 వీధి దుకాణాలు తయారు చేసినప్పటికీ మూడింటినే వ్యాపారులకు కేటాయించారు. మిగతా 50 దుకాణాలు కేటాయించకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోలేదు. పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సిరిసిల్ల పురపాలక సంఘం చేసిన ప్రయోగం విజయవంతమైంది. అయితే వీటిని తయారు చేసి ఏడాది గడిచినా వ్యాపారులకు అప్పగించకపోవటంతో అవి శిథిలమవుతున్నాయి.
ఎలా తయారుచేస్తారు.?
సిరిసిల్ల పురపాలక సంఘంలో వ్యర్థాల సేకరణ, ప్లాస్టిక్ పునర్వినియోగాన్ని అధికారులు ప్రణాళిక ప్రకారం చేపడుతున్నారు.
డీఆర్‌సీలో చెత్త నిర్వహణ ద్వారా మెప్మా సంఘాలకు ప్రతి నెలా రూ. 2.50 లక్షల ఆదాయం సమకూరుతుంది. తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మారుస్తుండగా, పొడి చెత్తలోని ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ యూనిట్లకు అందిస్తున్నారు.
ఊడిపోతున్న దుకాణం తలుపులు
పట్టణంలోని వీధులు పరిశుభ్రతలో భాగంగా మెప్మా సమాఖ్యలతో వీధి విక్రయ వ్యాపారులపై సర్వే చేయించారు. వీరు వీధి దుకాణాదారులను గుర్తించారు. ఈ జాబితా ప్రకారం పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి, బతుకమ్మఘాట్, శివనగర్, నెహ్రునగర్ ప్రాంతాల్లో వీధి విక్రయ దుకాణాలను తయారు చేయించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా వాటిని వ్యాపారులకు కేటాయించకపోవడంతో తలుపులు ఊడిపోయి శిథిలమవుతున్నాయి. ఫలితంగా లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది.
ఒక్కో దుకాణానికి 96 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు
- సిరిసిల్లలో రోజూ 1.5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పురపాలక సంఘం పారిశుద్ధ్య సిబ్బంది సేకరిస్తున్నారు. వీటితో వీధి విక్రయ దుకాణాలను తయారు చేశారు.
- 70 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు, 30 శాతం అల్యూమినియం ఉపయోగించారు.
- ఒక్కో దుకాణానికి 96 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించారు. అయితే అల్యూమినియంతో తయారు చేసిన తలుపులు ప్రారంభానికి నోచుకోకముందే శిథిలమవుతున్నాయి.
నిప్పు నుంచి రక్షణ..
గోడలకు తక్కువ సాంద్రత కలిగిన పాల ప్యాకెట్ల కవర్లు తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్‌ను వినియోగించారు. ఇలా మొత్తం 53 దుకాణాలను ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు చెందిన సామగ్రి తయారీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుంది. రూ. 96 లక్షలతో 53 వీధి విక్రయదుకాణాలను తయారు చేశారు. వీధి వ్యాపారులకు తక్కువ ఖర్చుతో శాశ్వత ఉపాధిని అందుబాటులోకి తీసుకురావాడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఇవి పట్టణ పరిశుభ్రతకు దోహదపడతాయని భావించారు.
దుకాణాల పైకప్పు, కింది భాగంలో ఇతర ప్లాస్టిక్ మిశ్రమాన్ని వాడారు. ఇవి నిప్పు, ఆమ్లం నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో నివసించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని పరిశోధించి రాష్ట్ర పరిశ్రమలశాఖ ధ్రువీకరించింది. దుకాణాల చుట్టూ పటుత్వం, రక్షణకోసం ఇనుప పట్టీలను అమర్చారు. పైకప్పు సిమెంటు రేకులతో తయారు చేశారు. తక్కువ బరువు ఉండటం వల్ల నిర్వహణకు సులువుగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం..
"ప్రస్తుతం తయారు చేసిన వీధి విక్రయ దుకాణాలను త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తాం. ప్రయోగాత్మకంగా ఇప్పటికే మూడు దుకాణాలను వీధి విక్రయదారులకు కేటాయించాం. వారు వాటిని నడిపించుకుంటున్నారు. సిరిసిల్ల పురపాలక సంఘంలోని వీధి వ్యాపారుల కోసం వీటిని ప్లాస్టిక్‌తో తయారు చేశాం. ఇలా చేయడం వల్ల పట్టణంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌ను నివారించినవారమవుతాం. రద్దీ ఉన్న కూడళ్ల సమీపంలో వీటిని ఏర్పాటు చేశాం. ఈ దుకాణాల్లోని సామగ్రికి పూర్తి భద్రత ఉంది. అల్పాదాయ వర్గాల వారి ఉపాధికి ఇది మంచి మార్గం. త్వరలోనే వీటిని ప్రారంభిస్తాం".
- సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల
ఇదీ చూడండి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి