ప్రజా భాగస్వామ్యం, పక్కా ప్రణాళికతో సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఆస్తుల నమోదును 5 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యం సాధించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్.. టీం సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఆస్తులను ధరణి యాప్‌లో పొందుపరచడం ద్వారా భద్రత, కచ్చితత్వం ఉంటుందని అన్నారు. పట్టణాల్లో వ్యవసాయేతర ఆస్తులన్నింటికీ గణన చేసి ఆస్తి హక్కు కల్పించడమే గాక మెరూన్ కలర్ పాస్‌బుక్‌లను యజమానులకు జారీ చేయనున్నట్లు తెలిపారు.
పట్టణాల్లో ఆస్తులను నమోదు చేసి భవిష్యత్తులో భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టిందని కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బృందాలు కృషి చేయాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 8 .30 గంటల వరకు రెండు విడతలుగా నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
ఆస్తుల నమోదు ప్రక్రియ పురోగతిని అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, శిక్షణ ఐఏఎస్ దీపక్ తివారీలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రోజూ వారీగా ప్రగతిని తనకు నివేదించాలని కలెక్టర్ ఆదేశించారు. మరణించిన వ్యక్తి పేరు మీదున్న ఆస్తులు, రికార్డ్ సక్రమంగా లేని, వివాదం ఉన్న ప్రాపర్టీ వివరాలను ఆఫ్‌లైన్‌లో సేకరించి సంబంధిత వివరాలను ప్రత్యేకంగా పొందుపరచాలని సూచించారు. ధరణి యాప్‌లో వివరాలు నమోదు చేసే క్రమంలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తితే.. వెంటనే పై అధికారులకు తెలియజేయాలని చెప్పారు. నిర్దేశిత గడువులోగా 100 శాతం వివరాలు నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలిపారు.