Murder Attempt on MP Kotha Prabhakar Reddy : బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన కడుపులో కత్తితో ఓ దుండగుడు కత్తితో పొడిచాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ప్రభాకర్‌రెడ్డిని గజ్వేల్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రచారం చేస్తూ సూరంపల్లిలో పాస్టర్ కుటుంబాన్ని ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు.
MP Kotha Prabhakar Reddy Was Stabbed With Knife : పరామర్శించిన తర్వాత వారి ఇంటి నుంచి బయటకు వస్తున్న ప్రభాకర్ రెడ్డితో ఓ వ్యక్తి కరచాలనం చేసేందుకు వచ్చినట్లుగా చేయి చాపుతూ వచ్చి అకస్మాత్తుగా .. కడుపులో కత్తితో పొడిచాడు. వెంటనే ఆయన పక్కనున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని పారిపోకుండా పట్టుకున్నారు. మరికొందరు వెంటనే ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. మొదటగా గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి.. అంబులెన్సులో ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోదకు తరలించారు. యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శస్త్ర చికిస్త చేశారు. అనంతరం ఐసీయూలో ఉంచి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దాడిలో పేగుకు గాయం కావడంతో ఇన్‌ఫెక్షన్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. కత్తితో దాడి చేసిన వ్యక్తిని రాజుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎంపీపై ఎందుకు దాడి చేశాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
MP Kotha Prabhakar Reddy Was Attacked : నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు ఈ సమాచారం అందింది. సమాచారం అందుకున్న ఆయన నారాయణఖేడ్‌కు వెళ్లకుండానే వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి బయల్దేరారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి వివరాలు సమర్పించాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అబ్డామన్ పరీక్ష నిర్వహించి.. కత్తి గాటు ఎంత వరకు ఉందో పరిశీలించారు. మరోవైపు మంత్రి హరీశ్ రావు ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు. కార్యకర్తలెవరూ సంయమనం కోల్పోకూడదని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
CM KCR Inquires on MP Kotha Prabhakar Reddy Health : గవర్నర్ తమిళి సై, మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. ఎంపీపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు.. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్దకు కార్యకర్తలెవరూ రాకూడదని.. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియజేస్తామని మంత్రి హరీశ్ రావు కార్యకర్తలకు సూచించారు.