MP Prabhakar Reddy Murder Attempt Case : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన రాజు మొదటి నుంచి జులాయిగా తిరుగుతుంటాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఏడో తరగతి వరకు చదివిన రాజు.. వివిధ ఆన్‌లైన్ పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లలో పని చేసినట్లు తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరాడని.. ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలకంగా లేడని తెలుస్తోంది. విలేకరిని అంటూ పలువురిని బెదిరిస్తూ వసూళ్లకు, అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. గ్రామస్థులు మూడేళ్ల క్రితం మిరుదొడ్డి ఠాణాలో ఫిర్యాదు చేయగా.. మందలించి వదిలిపెట్టారు. ఆ తర్వాత నిందితుడు మద్యానికి బానిసయ్యాడని స్థానికులు తెలిపారు.
MP Prabhakar Reddy Stabbed In Election Campaign : సోమవారం ఉదయం ఓ దుకాణంలో కత్తి కొన్నట్టు తెలుస్తోంది. దళితబంధుతో పాటు ఇంటి స్థలాలకు అర్హులైన విలేకరుల జాబితాలో తన పేరు లేదనే కోపంతోనే ఈ హత్య ప్రయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. రాజును పోలీసులు దౌల్తాబాద్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరోవైపు.. బీజేపీ మీడియా కన్వీనర్ నవీన్ అనే అతను దాడికి సంబంధించిన రెచ్చేగొట్టే పోస్టులు పెట్టాడని బీఆర్‌ఎస్ కార్యకర్తలు అతడిని చితక బాదారు. దీంతో నవీన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు నవీన్‌కు సపర్యలు చేసి తొలుత దుబ్బాక, తనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతణ్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించారు.
CP Swetha on Murder Attempt on MP Kotha Prabhakar Reddy : మరోపక్క ఎంపీ(MP Kotha Prabhakar Reddy)పై దాడికి పాల్పడిన పెద్దచెప్యాలలోని నిందితుడి ఇంటి వద్ద, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా దుబ్బాక సీఐ ఆధ్వర్యంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత పరిశీలించారు. దాడి చేసిన వ్యక్తి తమ అదుపులోనే ఉన్నాడని, సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నిందితుడి నుంచి మొత్తం 6 సోషల్ మీడియాకు సంబంధించిన గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఎంపీపై కత్తిదాడి ఉదంతంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై డీజీపీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు సిద్దిపేట ఎస్పీతో మాట్లాడి.. సంఘటన గురించి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు భద్రత పెంచారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు 2+2 భద్రత ఉండగా.. దాడి దృష్ట్యా భద్రతలను 4+4కు పెంచాలని ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్లు, ఎస్పీలకు లేఖ రాశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో నేటి నుంచి బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అదనపు భద్రత కల్పించనున్నారు.
"ఎంపీపై హత్యాయత్నం ఘటనపై దుబ్బాకలో ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెట్టాడు. దీంతో ఆ యువకుడిని బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎవరైనా పోస్ట్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం." - శ్వేత, సిద్దిపేట సీపీ
Police Protection Increased For Politicians : ఎంపీపై కత్తిదాడి ఘటనపై డీజీపీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు సిద్దిపేట ఎస్పీతో మాట్లాడి.. సంఘటన గురించి ఆరా తీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటిస్తుండటంతో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ప్రచారంలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు భద్రత పెంచారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇలాంటి దాడులు జరిగిన సందర్భాలు ఇటీవలి కాలంలో లేవు. వివిధ పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నా పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు చర్యలు తీసుకునేవారు. కానీ, ఎంపీ స్థాయి వ్యక్తిపై కత్తితో దాడి చేయడం ఇదే ప్రథమం కావటంతో చర్చనీయాంశంగా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తిని తక్షణమే పట్టుకున్నప్పటికీ సాంకేతికంగా దీన్ని భద్రతా వైఫల్యంగానే అధికారులు పరిగణిస్తున్నారు.
ముఖ్యంగా ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ భద్రత పొందుతున్నవారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆగంతుకులెవర్ని ప్రముఖుల దగ్గరకు రానివ్వకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. అవసరమైనవారికి అదనంగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించాలని.. వారి ఇళ్లు, కార్యాలయాల వద్ద కూడా నిఘా పెంచడంతోపాటు భద్రతా సిబ్బందిని కూడా పెంచాలని స్పష్టం చేశారు..