ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా.. పథకాలు ఆపలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బుస్సాపూర్‌లో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. గోదావరి నీళ్లు వస్తే.. ఇర్కోడ్, బుస్సాపూర్, వెంకటాపూర్ గ్రామాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మల్లన్నసాగర్, రంగనాయక జలాశయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు.
రైతు బంధు కోసం రూ.2 వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. రూ.8 వేల కోట్లతో రైతులకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నామని అన్నారు. ప్రతి రైతుకు రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.1,100 కోట్లను ఎల్ఐసీకి చెల్లిస్తున్నామన్నారు.
గ్రామ పంచాయతీకి కొత్త ట్రాక్టర్ ఇచ్చామని.. తడి, పొడి చెత్త సేకరణ కోసం బుట్టలు అందిస్తామన్నారు. రోడ్లపై చెత్త వేయొద్దని కోరారు. బుస్సాపూర్‌లో 158 మంది నిరక్షరాస్యులు ఉన్నారని వారందని అక్షరాస్యులుగా మార్చేలా యువత కృషిచేయాలని సూచించారు. వృద్ధులతో కాసేపు అక్షరాలు దిద్దించారు.
ఇవీచూడండి: 'అన్నదాతలు ఆర్థికంగా స్థిరపడాలన్నదే సర్కారు లక్ష్యం'